కథలు చెప్పటంలో కేసీఆర్ సమర్థుడు
హైదరాబాద్ : రాజకీయ క్రీడలో మునిగి తేలుతున్న కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికి ఒదిలేశారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కరెంట్, రైతు సమస్యలను టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవటం లేదని ఆయన దుయ్యబట్టారు. కరెంట్ కొరత, రైతు సమస్యలపై తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను చైతన్య పరిచేందుకే బస్సుయాత్ర చేపట్టామన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అనేదే లేదన్నారు. మొద్దునిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని తమ బస్సుయాత్రతో నిద్దర లేపుతామన్నారు. ఇప్పటికైనా ఓట్లు వేసిన ప్రజలకు మంచి పాలన ఇస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి సూచించారు.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు, సీఎం అయ్యాక కూడా కథలు చెబుతున్నారని, కథలు చెప్పటంలో కేసీఆర్ సమర్థుడన్నారు. ప్రజలకు కావల్సిందే కరెంట్ కానీ కథలు కాదని రేవంత్ రెడ్డి అన్నారు.రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు కరెంట్ కొరత ఉంటుందని ముందునుంచి తెలుసు అని, అయినా కేసీఆర్ దానిపై దృష్టి పెట్టకపోవటం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయినా విద్యుత్ శాఖకు పూర్తిస్థాయిలో మంత్రిని నియమించలేని అసమర్థ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాగే కేంద్రం నుంచి విద్యుత్ను తెచ్చుకోవటంలో కూడా విఫలం అయిన కేసీఆర్... చంద్రబాబు మీద పడి ఏడటం సరికాదన్నారు. కరెంట్ కొరతపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.