ఓపిక పడితే వాస్తవాలు తెలుస్తాయి...:కేసీఆర్
హైదరాబాద్ : 'ఓపిక పడితే వాస్తవాలు తెలుస్తాయి...మీ బండారం బయటపడుతుంది'...అని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శాసనసభలో టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర మొత్తం బయటకు రావాల్సిందేనని...రైతులకు అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు. లక్షలాది మంది రైతులు గమనిస్తున్నారని, తన ప్రసంగానికి అంతరాయం కలిగించటం సరికాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వంద వివరణలు ఇవ్వటానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వాస్తవాలను సభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్య కొత్తకాదని, వాస్తవాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు వద్దని, సమస్య తీవ్రతను బట్టి చర్చించి పరిష్కరించుకుంటే మంచిదన్నారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. దాంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది.