
ఏసీబీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే సండ్ర
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ నోటీసులు అందుకున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం విచారణకు హాజరు అయ్యారు. ఆయన ఈరోజు ఉదయం ఏసీబీ కార్యాలయానికి విచారణకు వచ్చారు. కాగా అనారోగ్య కారణాలతో సండ్ర వీరయ్య గతంలో ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. దాంతో ఆయనకు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సండ్రకు సీఆర్పీసీ సెక్షన్ 41(A) కింద ఏసీబీ నోటీసులు ఇచ్చింది.
ఇక ఓటుకు కోట్లు కేసులో మరో సూత్రధారి తెరపైకి వచ్చాడు. అతడే తాజాగా ఏసీబీ నోటీసులు అందుకున్న జిమ్మిబాబు. నేడు అతడు ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నాడు. జిమ్మిబాబుకు రెండు రోజుల క్రితం ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కాగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో జిమ్మిబాబుకు ఉన్న సాన్నిహిత్యంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరగుతోంది. జిమ్మిబాబు విచారణతో కేసులో కీలక ఆధారాలు సేకరించవచ్చని ఏసీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జిమ్మిబాబు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.