'బాస్' చంద్రబాబే: ఛార్జ్షీటులో ఏసీబీ | Claims `Boss' is andhra pradesh chief minister chandrababu niadu,cites Phone Call Recordings | Sakshi
Sakshi News home page

'బాస్' చంద్రబాబే: ఛార్జ్షీటులో ఏసీబీ

Published Wed, Jul 29 2015 1:11 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

'బాస్' చంద్రబాబే: ఛార్జ్షీటులో ఏసీబీ - Sakshi

'బాస్' చంద్రబాబే: ఛార్జ్షీటులో ఏసీబీ

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన 'నోటుకు కోట్లు' కేసుకు సంబంధించిన ఛార్జ్షీటులో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చేర్చినట్లు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ కథనం ప్రచురించింది.  'క్లైయిమ్స్ బాస్ ఈజ్ ఏపీ సీఎం' అంటూ ఆ పత్రిక మొదటి పేజీలో వార్తను వేసింది.  ఓటుకు కోట్లు కేసు ఛార్జ్షీటులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చినట్లు ఏసీబీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.సురేందర్ రావు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.ఐదు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలిస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.  సెబాస్టియన్ ఫోన్ నుంచి చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణతోపాటు చంద్రబాబు ఆదేశాల మేరకే తాను మాట్లాడేందుకు వచ్చానంటూ రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన సంభాషణల ఆధారంగా బాబు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది.


ఫోన్ కాల్స్ సంభాషణల ఆధారంగా 'బాస్' చంద్రబాబు నాయుడే అని నిర్థారించిన ఏసీబీ..ఈ మేరకు ఆయన పేరును ఛార్జ్షీటులో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి చంద్రబాబే సూత్రధారి అనేందుకు పక్కా ఆధారాలున్న నేపథ్యంలో బాబు పేరు ఛార్జ్షీట్లో చేర్చినట్లు సమాచారం. అలాగే ఓటుకు కోట్లు ప్రలోభాల పర్వం వెనుక ఉన్న కీలక వ్యక్తుల పాత్రపై పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మరో వారం రోజుల్లో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం  తన నివాసంలో డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ, పలువురు పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ ఛార్జిషీటు, భవిష్యత్‌ పరిణాలపై పోలీస్‌ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఈడీ కూడా రంగంలోకి దిగుతుందన్న వార్తలతో చంద్రబాబు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగా ఓటుకు కోట్లుతో సంబంధమున్న అనేక మంది ఫోన్ సంభాషణల సారాంశాన్ని డాక్యుమెంట్ల రూపంలో కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.  

ఈ కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు  తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు హ్యారీ సెబాస్టియన్, ఉదయ సింహ, మత్తయ్య (ప్రస్తుతం పరారీలో ఉన్నారు)లను నిందితులుగా పేర్కొంటూ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు)లోని సెక్షన్ 12, ఐపీసీ సెక్షన్లు 120(బి)(నేరపూరిత కుట్ర), 34 (కామన్ ఇంటెన్షన్) కింద అభియోగాలను మోపుతూ బుధవారం 25 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసిన ఏసీబీ ఇందులో 39 మందిని సాక్షులుగా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement