
'హరీశ్ రావు నడిపిస్తున్నారు...'
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో తమ సస్పెన్షన్ ఎత్తివేసేలా చర్య తీసుకోవాలంటూ టీ.టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. అ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు...తెలంగాణ ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు.
ఆ భేటీ అనంతరం ఎర్రబెల్లి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ కేబినెట్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనసాగింపు, శాసన మండలిలో ఎమ్మెల్సీల విలీన ప్రకటన, టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు.... అప్రజాస్వామికమన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నాలుగు సీడీలు ఉంటే వాటిలో ఒక సీడీని కటింగ్ చేసి చూపించారని ఎర్రబెల్లి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను కొట్టిన దృశ్యాలున్న సీడీనీ మాయం చేశారని ఆయన అన్నారు. ఆ నాలుగు సీడీలను గవర్నర్ పరిశీలించాలని తాము కోరామన్నారు.
అసెంబ్లీని నడిపిస్తున్నది స్పీకర్ కాదని,శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. తమను సభ నుంచి సస్పెండ్ చేసిన రోజు స్పీకర్ తమకు మైక్ ఇచ్చి క్షమాపణ చెప్పాలని అడగలేదన్నారు. హరీశ్ రావే ...దయాకరరావుకి మైక్ ఇవ్వండి..క్షమాపణ చెప్పాలని ఆదేశించారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి గుర్తు చేశారు. సభా నాయకుడి డైరెక్షన్లో స్పీకర్ పనిచేస్తున్నారని ఆయన అన్నారు.
జాతీయ గీతాన్ని అవమానించినట్లు అయితే క్షమాపణలు కోరమని స్పీకర్ కోరాలని అన్నారు. అయితే స్పీకర్ కంటే ముందే హరీశ్ రావే డిమాండ్ చేశారన్నారు. ఈ విషయంపై గవర్నర్ జోక్యం చేసుకోకపోతే రాష్ట్రపతిని కలవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మండలిలో టీడీపీని విలీనం చేస్తున్నట్టు చెప్పిన బులెటిన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఎర్రబెల్లి చేశారు. మంత్రుల అవినీతి బట్టబయలు చేస్తామనే తమపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు.