
ఆత్మ ప్రభోదం అంటే అసలుకే మోసమే దయాకరన్నా!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేయాలని ఎన్టీఆర్ భవన్ సాక్షిగా సెలవిచ్చారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన మాటలను టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు ‘అవునా... అన్నా!’ అని వెటకారం పోతున్నారు. ఆత్మ ప్రబోధం మేరకు ఓటేస్తే టీఆర్‌ఎస్ లోని అసంతృప్తులు కాదు గానీ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం కచ్చితంగా గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటేయడం ఖాయమని గంటా భజాయించి మరీ చెపుతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 15 మందిలో నలుగురు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లోకి జంప్. మిగిలిన 11 మందిలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం కేసీఆర్ ఫాం హౌజ్‌కు వెళ్లి గులాబీ కండువా కప్పుకున్నారు కూడా! గత కొంతకాలంగా ఊగిసలాడుతున్నా ‘సరైన’ సమయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆత్మ ప్రబోధం మేరకే టీడీపీని వీడినట్టు చెణుకులు విసురుకుంటున్నారు తమ్ముళ్లు.
ఇక నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్లు ఇస్తే వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరుతానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ గత కొన్ని నెలలుగా చెపుతున్నారు.. ఆయనకు రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన తరువాత కూడా ‘అన్న మాట తప్పలేదు’. మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న తుమ్మల నాగేశ్వర్‌రావుకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ దగ్గరివారు.. గాంధీ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన తుమ్మల కోసం ఈయన కూడా ‘ఆత్మ’ను చంపుకోకపోవచ్చు. వీరందరినీ సముదాయించి, తాయిలాలు ఆశచూపి చంద్రబాబు పార్టీ వీడకుండా కాపాడుకుంటున్నా... చివరికి చేరాల్సిన గూటికే చేరుతున్నారు. దయాకరన్న చెప్పినట్లు ఆత్మ ప్రబోధం మేరకు ఓటేయడం సంగతి తరువాత... పార్టీ మారుతారేమో!!
- తెలంగాణ బ్యూరో