
మీపై నమ్మకం ఉంది
♦ తప్పులు చేయకండి.. జాగ్రత్తగా ఓటేయండి
♦ ఐదు స్థానాలూ మనవే
♦ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం
♦ తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ‘మాక్ ’ పోలింగ్
సాక్షి, హైదరాబాద్: ‘మీ పై నాకు విశ్వాసం ఉంది. ఏడాదిగా కలసి పనిచేస్తున్నాం. మీపై నమ్మకం ఉంది. అయితే, తప్పులు చేయకండి. జాగ్రత్తగా ఉండండి..’ అని సీఎం చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో అన్నారు.
శాసన మండలి ఎన్నికల్లో భాగంగా తమ ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్ నాయకత్వం ఆదివారం తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్ నిర్వహించింది. దీనికి హాజరైన సీఎం కేసీఆర్ పదిహేను నిమిషాల పాటు ఎమ్మెల్యేలతో గడిపారు. రెండు రోజుల కిందట జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడితే, అసెంబ్లీని రద్దు చేయడానికి కూడా వెనకాడ నని కేసీఆర్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన విషయం తెలిసిందే.
కాగా, ఆదివారం మాక్ పోలింగ్‌కు హాజరైన సీఎం ఎమ్మెల్యేలను బుజ్జగించేలా మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అయిదు స్థానాలనూ గెలుచుకుంటామని అన్నారు. తెలంగాణ భవన్‌లో మాక్ పోలింగ్ ముగిశాక, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలకు కలిపి టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మరో మారు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.
నియోజకవర్గం కోసమే: మాధవరం
తెలంగాణ భవన్‌లో జరిగిన మాక్ పోలింగ్‌కు హాజరైన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్కడే విలేకరులతో మాట్లాడారు. తన నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే టీఆర్‌ఎస్‌లో చేరానని పేర్కొన్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఆయన శనివారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.