
'ఓటు అడిగేందుకు కలిసిన విషయం వాస్తవమే'
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటు అడిగేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ను కలిసిన విషయం వాస్తవమేనని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రేవంత్రెడ్డిని అవినీతి రాజకీయాలతో ఇరికించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీని అంతం చేయాలని చూస్తే మీరే మిగలరని టీఆర్ఎస్ నేతలను ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. చేసిన తప్పులన్నీ ఒప్పుకొని, బేషరతుగా రేవంత్మీద కేసు విత్ డ్రా చేసుకోవాలని ఆయన అన్నారు. రేవంత్ విషయంలో ఏసీబీ వాళ్లను ప్రలోభపెట్టారని దుయ్యబట్టారు. ఈ కేసులో రేవంత్కు తప్పకుండా న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసినవాళ్లను కూడా దగ్గరకు చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.
63 మంది ఎమ్మెల్యేలున్నా ఐదుగురు అభ్యర్థులను ఎలా బరిలోకి దింపారని ఎర్రబెల్లి సూటిగా ప్రశ్నించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టిందని సమాచారం ఉందని ఆయన అన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఇతర ఎమ్మెల్యేలను కొనేందుకు 200 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహులకు టికెట్లు ఇచ్చి నైతిక విలువల కోసం మాట్లాడతారా? అంటూ దుయ్యబట్టారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎంతెంత ఇచ్చి పార్టీలోకి చేర్చుకున్నారన్న దానిపై విచారణ జరగాలన్నారు. ప్రభుత్వంపై న్యాయపోరాటం చేశాడనే రేవంత్ను వ్యూహాత్మకంగా ఇరికించారని ఎర్రబెల్లి విమర్శించారు.