ఫేస్‌బుక్‌లో వివాహితకు వల
'హైదరాబాద్ మహిళతో ఉపాధ్యాయుడి సహజీవనం, అరెస్ట్
బంజారాహిల్స్ : ఫేస్‌బుక్‌లో పరిచయమైన వివాహిత (48)కు ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో వల వేసి సహజీవనం చేస్తున్నాడు. నిందితుడిని మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నగరానికి చెందిన ఓ ట్రాఫిక్ ఎస్సై భార్యను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో నివాసం ఉంటూ కాసిపేట మండలంలోని మల్కేపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న చల్లా జ్ఞానేశ్వర్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెకు వల వేసి మంచిర్యాల తీసుకెళ్లి పద్మావతి కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నాడు. తన భార్య కనిపించడం లేదంటూ ట్రాఫిక్ ఎస్సై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గత శుక్రవారం మంచిర్యాల వెళ్లి సదరు వివాహితను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె తనకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన జ్ఞానేశ్వర్ విషయం వెల్లడించింది. తన భార్యకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వివాహిత భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జ్ఞానేశ్వర్‌పై గతంలో యువతులకు ప్రేమపేరుతో వల వేసి మోసం చేసిన కేసులున్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.