మహబూబ్‌నగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : ఏళ్ల తరబడి బదిలీలు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన స్పందించి త్వరలోనే బదిలీలు ఉంటాయని.. ఇందుకోసం షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడించారు. అయితే, ఇంకా షెడ్యూల్ విడుదల కాకపోగా అర్హులైన ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే కొందరు ఉపాధ్యాయులు పలువురు రాజకీయనాయకుల అండదండలతో రాష్ట్ర సచివాలయం నుంచే నేరుగా బదిలీ చేయించుకునేలా పైరవీలు ప్రారంభించారు. ఇలా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 మంది ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు అందాయి కూడా! దీంతో అర్హులైన ఉపాధ్యాయులు ఆ స్థానాలను నష్టపోయినట్లుగా భావించాల్సి వస్తోంది. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి షెడ్యూల్ ప్రకారమే బదిలీల ప్రక్రియ నిర్వహించాలే తప్ప ఎవరికి కూడా ముందస్తు ఉత్తర్వులు ఇవ్వొద్దని పలువురు కోరుతున్నారు.
2015 జూన్‌లో చివరిసారి..
గతంలో చివరిసారిగా ఉపాధ్యాయుల బదిలీలు 2015 జూన్‌లో జరిగాయి. అప్పటి నుండి మళ్లీ బదిలీలకు సంబందించి ఎటువంటి ప్రస్తావన రాలేదు. చాలా మంది ఉపాధ్యాయుల అవసరాలు, ఇబ్బందులతో పాటు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌తో ప్రభుత్వం ఎట్లకేలకు బదిలీలు చేపట్టేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొందరు ఉపాధ్యాయులు నేరుగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పెద్దల అండదండలతో బదిలీ చేసుకునేందుకు పైరవీలు చేస్తున్నారు.
14మందికి ఉత్తర్వులు
ప్రభుత్వ పెద్దలు, కొన్ని సంఘాల నేతల అండ దండలతో ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయిలో బదిలీ కోసం పైరవీలు ప్రారంభించారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు గురువారం జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రతులు మహబూ బ్‌నగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరాయి. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా పరిధి లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురికి ఇతర జిల్లాలకు బదిలీ అయింది. ఇక జిల్లాలోనే వివిధ మండలాలకు ఐదుగురికి బదిలీ కాగా.. నాగర్‌కర్నూల్, జోగుళాంబ గ ద్వాల, వనపర్తి జిల్లాల నుండి ఒక్కొక్కరు చొప్పున మహబూబ్‌నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు.
ముందస్తు బదిలీలతో పోస్టుల్లో తగ్గుదల
ఉపాధ్యాయల సౌలభ్యం కోసం చేపట్టే సాధారణ బదిలీల ప్రక్రియలో కేవలం జిల్లా స్థాయిలో మాత్రమే ఉంటాయి. ఈ ప్రక్రియ ఆయా పాఠశాలల వారి ఖాళీలు, అవసరం ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య మేరకు భర్తీ చేస్తారు. కానీ ప్రస్తుతం సెక్రటరీయేట్ స్థాయిలో జరిగే బదిలీలు జిల్లాల పరిధి దాటి జరుగుతున్నాయి. దీని కారణంగా జిల్లాలో గతంలో ఖాళీ పోస్టుల సంఖ్య తగ్గిపోతుంది. జిల్లా స్థాయిలో బదిలీ జరిగితే మొదటి స్థానాన్ని ఖాళీగా చూపించే అవకాశముంటుంది. కానీ వేరే జిల్లా నుంచి ఇక్కడకు ఉపాధ్యాయులు రావడంతో ఆ స్థానం నిండిపోయి ఖాళీల్లో తగ్గుదల ఉంటుంది. తద్వారా ఏళ్ల తరబడి బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారు నష్టపోయే అవకాశముంటుంది.
అర్హులకు అన్యాయం
ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియను ఈసారి ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా వాస్తవ ఖాళీలను తొలుత గుర్తించి.. ఒక్కరొక్కరుగా ఉపాధ్యాయుల బదిలీ జరగగానే ఆ స్థానం ఖాళీగా చూపించేలా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తారు. తొలి ప్రాధాన్యతగా చాలాకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు, శారీరక వికలాంగులు, వితంతువులు, వయస్సు పైబడిన వారితో పాటు భార్యాభర్తలు ఒకే చోట(స్పౌజ్)కు వచ్చేలా బదిలీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంతలో కొందరు అక్రమంగా బదిలీ చేయించుకుంటుండడంతో తొలి ప్రాధాన్యత క్రమంలో బదిలీ జరగాల్సి వారికి నష్టం జరుగుతుంది. దీనిని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వ్యతిరేకిస్తుండగా.. మరికొన్ని సంఘాల బాధ్యులు స్థబ్దుగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి షెడ్యూల్ విడుదల చేసే వరకు ఎవరిని కూడా రాష్ట్ర స్థాయిలో బదిలీ చేయొద్దనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమంగా ఉత్తర్వులు ఇవ్వొద్దు..
జిల్లాలో పలువురు ఉపాధ్యాయులకు సంబం ధించి నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న బదిలీలను వెంటనే నిలిపివేయాలి. ప్రభుత్వం ఓవైపు బదిలీలు చేసేందుకు కసరత్తు చేస్తుంటే.. ప్రభుత్వ పెద్దలతో పలుకుపడి ఉన్నవారు అక్రమంగా బదిలీలు చేయించుకోడం బాధాకరమైన అంశం. దీని ద్వారా వాస్తవంగా లబ్ది పొందాల్సిన ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
– దుంకుడు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు, టీపీఆర్టీయూ
నిధులు విడుదల కాలేదు..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. ఒకటి, రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఏటా మాదిరిగానే ఆవిర్భావ ఉత్సవాలను కచ్చితంగా నిర్వహిస్తాం. అందుకు సంబంధించిన ప్రణాళికను కూడా త్వరలో ఖరారు చేస్తాం. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అందజేసే పురస్కారాల విషయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం.
– వెంకటేశ్వర్లు, డీఆర్వో
Comments
Please login to add a commentAdd a comment