
మోటార్ ఆన్ చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులు
ధర్మారం: తెలంగాణ బాహుబలి అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద ప్యాకేజీ– 6లో భాగంగా నిర్మించిన సర్జిపూల్ మరో అద్భుత ఘట్టానికి వేదిక అయింది. బుధవారం ఒక్కరోజే రెండు (3, 4) మోటార్ల వెట్ రన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. గత నెల 24న మొదటి మోటార్, 25న రెండో మోటార్‌ను సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ ప్రారంభించారు. రెండు మోటార్ల వెట్‌రన్ విజయవంతమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మూడు, నాలుగో మోటార్ వెట్ రన్‌ను ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ దేశ్‌పాండే, నీటి పారుదల శాఖ సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ బుధవారం నిర్వహించారు.
ఎగిసిపడిన గంగమ్మ
మోటార్లు ఆన్ చేసిన వెంటనే సుమారు 105 మీటర్ల లోతు నుంచి గోదావరి జలాలు ఉపరితలంలోని మేడారం రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన మూడో సిస్టర్న్ ద్వారా ఎగిసి పడ్డాయి. అప్పటి వరకు ఉత్కంఠగా ఎదురు చూసిన అధికారులు గోదావరి పరుగులు చూసి సంబరాలు చేసుకున్నారు. ఎలాంటి అంతరాయం కలుగకుండా వెట్‌రన్ విజయవంతం కావటంతో ఇంజనీరింగ్ అధికారులు, నవయుగ కంపెనీ ప్రతినిధులు, ట్రాన్స్‌కో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తూ జై తెలంగాణ నినాదాలు చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం సిస్టర్న్‌ల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. సుమారు 30 నిమిషాలు వెట్‌రన్ నిర్వహించారు.
సిస్టర్న్ ద్వారా ఉబికి వస్తున్న గోదావరి జలాలు
సాయంత్రం నాలుగో మోటార్
ఈ క్రమంలోనే నాలుగో మోటార్ వెట్‌రన్‌ను కూడా అధికారులు సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. 6:45 గంటలకు ఇంజనీరింగ్ అధికారులు మోటార్ స్విచ్ ఆన్‌చేసి వెట్‌రన్ ప్రారంభించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాలుగో మోటార్ కూడా 25 నిమిషాలు విజయవంతంగా గోదావరి నీటిని 105 మీటర్ల ఉపరితలంలోని సిస్టర్న్ ద్వారా లిఫ్ట్ చేయడంతో అధికారులు ఆనందంలో మునిగిపోయారు. రెండు మోటార్లు ఒకే రోజు విజయవంతం కావడంపై ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment