* సీఎం కేసీఆర్ నిర్ణయం.. ముఖ్యనేతలకు సంకేతాలు
* అందుబాటులో ఉండాలని సమాచారం.. ఆశావహుల్లో టెన్షన్
* తుమ్మల, కొప్పుల, జూపల్లి, లక్ష్మారెడ్డికి బెర్త్ ఖాయం!
* గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి సుదీర్ఘ భేటీ
* బడ్జెట్ సమావేశాలు, హైకోర్టు విభజన, విద్యుత్ సంక్షోభంపై చర్చ
* దీపావళి తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 22న మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేబినెట్‌లో బెర్తు ఖాయమని భావిస్తున్న కొందరికి ఇప్పటికే ఈ సంకేతాలు అందినట్టు తెలుస్తోంది. ఈ నెల 22న అందుబాటులో ఉండాలని, మరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోవద్దంటూ వారికి కేసీఆర్ స్వయంగా సమాచారం ఇచ్చినట్టుగా వినవస్తోంది. కేబినెట్ విస్తరణ కచ్చితంగా ఉంటుందని భావించినప్పటికీ కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది.
జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుతోనే ముఖ్యమంత్రిగా కేసీఆర్‌తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని అప్పుడే కేసీఆర్ ప్రకటించారు. అయితే అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ నాలుగున్నర నెలలు దాటింది. మరోవైపు మంత్రివర్గంలో బెర్తు కోసం ఆశావహుల జాబితా కూడా పెరుగుతోంది. తీవ్ర జాప్యం నేపథ్యంలో ఈ నెల 22న కేబినెట్ విస్తరణకు సీఎం తాజాగా ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఆ రోజున అందుబాటులో ఉండాలని కొందరు నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
తుమ్మల నాగేశ్వర్‌రావు(ఖమ్మం), కొప్పుల ఈశ్వర్(కరీంనగర్), జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మా రెడ్డి(మహబూబ్‌నగర్)కి మంత్రివర్గంలో చోటు ఖాయమని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల నుంచి పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్త్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. కొండా సురేఖ, ఆజ్మీరా చందూలాల్, దాస్యం వినయభాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, కోవా లక్ష్మి, రేఖా నాయక్, ఏనుగు రవీందర్ రెడ్డి, గంపా గోవర్ధన్ తదితరులు తమకు మంత్రి పదవి దక్కుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. విస్తరణ తేదీపై నేతలందరితోనూ ఉత్కంఠ నెలకొంది.
గవర్నర్‌తో పలు అంశాలపై చర్చ
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం గంటన్నరపాటు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, మంత్రివర్గ విస్తరణ, హైకోర్టు ఏర్పాటు, విద్యుత్ సమస్య వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించుకున్నారు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న అసెంబ్లీ సమావేశాలను దీపావళి తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ వివరాలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు సమాచారం. ఈ నెల 27 నుంచి సమావేశాలు ప్రారంభంకానున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
బడ్జెట్ కసరత్తు పూర్తవుతున్న నేపథ్యంలో.. అసెంబ్లీ భేటీకి నోటిఫికేషన్ జారీ చేసే అంశంపై ముఖ్యమంత్రి చర్చించారు. సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని భావించినప్పటికీ.. వివిధ కారణాలతో ఆ నిర్ణయం వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ రెండో తేదీలోగా బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సిన చట్టపరమైన ఆవశ్యకత నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తప్పనిసరి. దీంతో భేటీ తేదీలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో నవంబర్ తొలి వారంలో ఈ సమావేశాలు ఉంటాయని ప్రచారం జరిగింది. అధికారవర్గాలు మాత్రం ఈ నెల 18 నుంచే 20 రోజులపాటు బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశముందని పేర్కొంటున్నాయి.
కాగా, బడ్జెట్ సమావేశాలకు ముందుగానే మంత్రివర్గాన్ని విస్తరించాలన్న ఆలోచనను కూడా గవర్నర్ వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది. అలాగే గత వారం చేపట్టిన ఢిల్లీ పర్యటన వివరాలను కూడా వివరించినట్లు సమాచారం. హైకోర్టు విభజన కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని తెలియజేశారు. హైకోర్టు భవనం కోసం హైదరాబాద్‌లో చారిత్రాత్మక కట్టడాలను ఇటీవల పరిశీలించినట్లు కూడా తెలిపారు.
అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సమస్యపైనా ఇరువురి మధ్య చర్చ జరిగింది. డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోందని, విద్యుత్ కొనుగోళ్లు చేపడుతున్నా కోతలు తప్పడం లేదని సీఎం వివరణ ఇచ్చారు. పెన్షన్లు, ఆహార భద్రతా కార్డుల అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని, అర్హులందరికీ సాయం అందేలా చూస్తామని కేసీఆర్ చెప్పారు.
22న కేబినెట్ విస్తరణ!
Published Fri, Oct 17 2014 12:45 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement