రేపు టీ-కేబినెట్ తొలి భేటీ
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై దృష్టి
గవర్నర్ ప్రసంగ పాఠానికి ఆమోదం
రుణ మాఫీ, ఇతర హామీల అమలుపై చర్చించే అవకాశం
9 నుంచి 12 వరకు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి తొలి అధికారిక సమావేశం ఆదివారం రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ నెల 9 నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ తొలి సమావేశాల నిర్వహణపైనే కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగ పాఠానికి ఆమోద ముద్ర వేయనుంది. అలాగే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా రైతుల రుణ మాఫీ, తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసుల ఎత్తివేత వంటి అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో చర్చించిన మేరకు రుణ మాఫీని ఒక్క ఏడాదికి మాత్రమే పరిమితం చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించిన తర్వాత తలెత్తిన పరిస్థితులపై మంత్రి మండలిలో చర్చ జరిగే అవకాశముంది. ఇక ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు, ఎరువుల లభ్యతపైనా దృష్టి సారించనుంది. కాగా, సాధారణ ఎన్నికలకు సంబంధించిన అంశాలతోపాటు రాజ్యసభ, శాసన మండలి ఖాళీలు, సభ్యుల వివరాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఈ సందర్భంగా కేబినెట్‌కు అందించనున్నట్లు తెలిసింది.
అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు
తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల నిర్వహణకు వీలుగా ఈ నెల 9న ఉదయం 9.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 10వ తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 11న గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 12న గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాదాలు తెలిపాక సమావేశాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ చుట్టూ రెండు కిలోమీటర్ల దూరంలో ఎలాంటి ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఆంక్షలు 9న ఉదయం ఆరు గంటల నుంచి 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయి.