టీఆర్‌ఎస్ పోరాటంతోనే తెలంగాణ
చొప్పదండి, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ ఉద్యమ నేతృత్వంలో సుదీర్ఘ రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించామని పార్టీ జిల్లా ఇన్‌చార్జి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, బోయినపల్లి, గంగాధర మండలాలకు చెందిన సుమారు వెయ్యి మంది టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో ఆదివారం చేరారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చిన చివరి రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని, అయితే తామే తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. టీడీపీ సైతం రెండు కళ్ల సిద్ధాంతంతో అడుగడుగున రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించిందని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి బొడిగె శోభ, మండల శాఖ అధ్యక్షులు చుక్కరెడ్డి, మహిపాల్‌రావు, యాదయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.