
పీఆర్సీ విషయం వెంటనే తేల్చండి: కేసీఆర్
ఉద్యోగుల పీఆర్సీ విషయాన్ని చర్చించి త్వరగా తేల్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే, రైతులకు సోలార్ పంపుసెట్లు అందించేందుకు ఉద్దేశించిన టెండర్ల ఖరారు అంశాన్ని కూడా సీఎస్ కమిటీకి అప్పగించాలని నిర్ణయించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ లాంటి ముఖ్యశాఖల్లో పనిచేసిన ఉద్యోగులు వేరే చోటకు డిప్యూటేషన్పై వెళ్తే వారిని వెంటనే మాతృశాఖకు సమర్పించాలని కేసీఆర్ ఆదేశించారు.
వ్యవసాయ ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు రోడ్లపైకి రావడం వల్ల రోడ్లు బాగా పాడవుతున్నాయని ఆయన చెప్పారు. పనిముట్లతో ఉన్న ట్రాక్టర్లను రోడ్ల మీద తిప్పకుండా ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని సీఎం కోరారు. అలాంటి చర్యలు పునరావృతం అయితే బాధ్యులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. మెదక్ జిల్లా గజ్వేల్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో రెండువేల మంది పట్టే ఆడిటోరియాన్ని నిర్మిస్తామని కూడా కేసీఆర్ చెప్పారు.