
సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు!
డీవోపీటీకి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని 3 నెలలపాటు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగానికి (డీవోపీటీ) లేఖ రాశారు. రాష్ట్ర సాధారణ పరిపాలనా విభాగం గురు వారం ఈ లేఖను డీవోపీటీకి పంపించింది. కొత్త రాష్ట్రం కావడంతో పాటు ఐఏఎస్ అధికారుల కొరత ఉండటంతో సీనియర్ అధికారుల సేవలు అవసరమని సీఎం భావిస్తున్నారు.
అందుకే సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తే ఐఏఎస్ అధికారుల సర్వీసును 3 నెలల పాటు పొడిగించే వీలుంది. అఖిల భారత సర్వీసు అధికారుల సర్వీసు నిబం దనల ప్రకారం ఈ వెసులుబాటు ఇచ్చే అధికారం కేంద్రం పరిధిలో ఉంటుంది. రాష్ట్ర తొలి సీఎస్ రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని కేంద్రం ఇదే తరహాలో వరుసగా 2 సార్లు మూడు నెలల చొప్పున పొడిగించటం తెలిసిందే. తాజాగా ప్రదీప్ చంద్రకు మరో 3 నెలల పాటు సర్వీసు పొడిగించాలని కోరటంతో డిసెంబర్ 31న ముగియనున్న సీఎస్ పద వీకాలం వచ్చే ఏడాది మార్చి 31 దాకా కొనసాగే అవకాశాలున్నాయి.