
మహబూబ్‌నగర్ న్యూటౌన్ :ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో అధికారులు చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు సఫలీకృతమైంది. తాజాగా ఎన్నికల కమీషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలో కొత్తగా 73,024 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. తుది జాబితా ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 10,04,481 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 5,02,528 మంది పురుపులు, 5,01,900 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ఇతరులు 53 మంది ఓటు హక్కు పొందారు. అదేవిధంగా ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఇద్దరు, సర్వీస్ ఓటర్లు 641 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
గణనీయమైన పెరుగుదల
జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే గణనీయంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. తాజాగా విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 10,04,481 మంది ఓటర్లు నమోదయ్యారు. గతంలో విడుదల చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్–2018 ఫైనల్ ఓటర్ల జాబితాతో పోలిస్తే తాజాగా జాబితాలో 73,024 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. ఇందులో పురుషులు 35,285 మంది, స్త్రీలు 37,762 మంది ఓటర్లుగా నమోదయ్యారు.
మహబూబ్‌నగర్ ఫస్ట్
జిల్లాలోని ఐదు అసెంబ్లీల్లో నియోజకవర్గాల్లో పోలిస్తే మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 2,07,280 మంది ఓటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో మక్తల్ నియోజకవర్గం 2,06,909 మంది ఓటర్లతో ఉండగా.. జడ్చర్ల నియోజకవర్గం 1,89,915 మంది ఓటర్లతో చివరి స్థానంలో నిలిచింది. కాగా నారాయణపేట, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం.
ఈసీ ఆదేశాల మేరకు
తెలంగాణ శాసనసభను రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాల రూపకల్పనకు చర్యలు తీసుకుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితా ల తయారీ, కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ, చేర్పులు మార్పులు వంటి అంశాలపై నెల రోజులు చేసిన కసరత్తుకు ఎన్నికల కమిషన్ తుది రూపునిచ్చింది. సెప్టెంబర్ 10న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయగా సెప్టెంబర్ 25 వరకు అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది. కొత్త ఓటర్ల నమోదుపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం మంచి ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పవచ్చు. కాగా, జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల తుది జాబితాను తాజాగా విడుదల చేసింది.
ఒకటికి రెండుసార్లు పరిశీలన
ఓటర్ల జాబితాల రూపకల్పనలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అధికారులు నెల రోజులుగా కసరత్తే చేశారు. బీఎల్‌ఓలకు శిక్షణలు, రాజకీయ పార్టీలతో సమావేశాలు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పకడ్బందీ చర్య లు తీసుకున్నారు. బీఎల్‌ఓల పరిధిలోని ఓటర్ల వివరాలకు పూర్తి బాధ్యతను వారికే అప్పగించి ఒకటికి రెండుసార్లు పరిశీలన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment