
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. సోమవారం ముసాయిదా జాబితా ప్రకటించి, అభ్యంతరాలను ఆహ్వానిస్తూ నిర్ణీత తేదీలను వెల్లడించారు. అభ్యంతరాలను ఈ నెల 25వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యంతరాలను అక్టోబర్ 4లోగా పరిష్కరించి తుది జాబితాను అక్టోబర్ 8న వెలువరించనున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూలు మేరకు ఈ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ చర్యలు చేపట్టారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారుల్లో జీహెచ్‌ఎంసీలో మూడేళ్లుగా పనిచేస్తున్నవారి వివరాలను సిద్ధంచేశారు. రేపేమాపో వీరి బదిలీలు జరుగనున్నాయి. జీహెచ్‌ఎంసీలో మొత్తం 30 సర్కిళ్లకుగాను 30 మంది డిప్యూటీ కమిషనర్లుండగా, వీరిలో 14 మందికి బదిలీ తప్పకపోవచ్చని తెలుస్తోంది. వీరితోపాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా, ఇతరత్రా బాధ్యతలు నిర్వహించే వారి బదిలీలు కూడా జరగనున్నాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనేవారి బదిలీలు అనివార్యం కావడంతో జీహెచ్‌ఎంసీలో 50మందికి పైగా బదిలీలు జరగనున్నాయని తెలుస్తోంది. ఎన్నికల విధులు నిర్వర్తించేవారిలో అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్లు, ఏసీపీలు, ఇంజినీర్లు తదితరులున్నారు.
జిల్లాకు 6120 బ్యాలెట్ యూనిట్లు..
మరోవైపు ఎన్నికల యంత్రాలు, సామగ్రిపైనా అధికారులు దృష్టి సారించారు. జిల్లాలో ప్రస్తుతం 3761 పోలింగ్ కేంద్రాలుండగా, వీటి సంఖ్య 3826కు పెరగనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈ నెల 17న నగరానికి రానున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. బెంగళూర్ నుంచి బీహెచ్‌ఈఎల్ తయారు చేసిన 6120 బ్యాలెట్ యూనిట్లు, 4780 కంట్రోల్ యూనిట్లతోపాటు 5170 వీవీప్యాట్‌లు ఈసారి కొత్తగా రానున్నాయి. వీవీప్యాట్‌లతో ఎవరికి ఓటు పడిందో కూడా తెలుస్తుంది.
నవ ఓటర్లకు ఓటు హుళక్కే..
ఈ నెల ఒకటో తేదీన జారీ చేసిన ముసాయిదానే మారిన షెడ్యూలుకనుగుణంగా సోమవారం విడుదల చేశారు. షెడ్యూలు మారకముందు అభ్యంతరాల స్వీకరణకు అక్టోబర్ 31 వరకు గడువుండటంతోపాటు 2019 జనవరి ఒకటోతేదీనాటికి 18 ఏళ్లు నిండేవారందరికీ ఓటర్లుగా పేరు నమోదుకు అవకాశం ఉండేది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో షెడ్యూలును కుదించడంతోపాటు 2018 జనవరి ఒకటో తేదీనాటికి ఓటుహక్కు కలిగిన వారినే ఓటర్లుగా జాబితాలో నమోదు చేయనున్నారు. దీంతో 2019 జనవరి ఒకటోతేదీనాటికి ఓటుహక్కు పొందే ఎందరో రాబోయే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. ముసాయిదా మేరకు హైదరాబాద్ జిల్లాలో 38,61,009 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 20,17,448మంది, మహిళలు 18,43,277 మంది, ఇతరులు 284 మంది ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు జిల్లాల్లో వెరసి మొత్తం 74,21,528 మంది ఓటర్లుండటం తెలిసిందే.