భద్రాచలం : ఏపీకి బదలాయించిన ఏడు మండలాల్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఈ ఖాళీల్లో ఆంధ్రకు చెందిన ఉద్యోగులను నియమించేందుకు అక్కడి ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్‌లకు ఆదేశాలు వచ్చాయి. ప్రత్యేక సర్క్యులర్ రూపంలో ఉన్న ఆ ఉత్తర్వులు మంగళవారం ఉభయ గోదావరి జిల్లాల కలెక్టరేట్‌లకు అందినట్లుగా తెలిసింది.
ఏపీ స్టేట్ రీ ఆర్గనైజేషన్ బిల్లు అమల్లోకి వచ్చిన జూన్ 2, 2014 నాటికి ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రాతిపదికగా తీసుకొని నియామకాలు చేపట్టాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నట్లుగా సమాచారం. ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లో ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించిన ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్‌లు ఈ మేరకు నియామకాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో విలీనమైన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో అక్కడి జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద దీనిపై చర్యలకు ఉపక్రమించింది.
ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లో మొత్తం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం 3142 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2173 మంది పనిచేస్తుండగా, మిగతా 969 ఖాళీలను ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. ఎక్కువగా పాఠశాల విద్యాశాఖలో 333, గిరిజన సంక్షేమ విద్యాశాఖలో 220 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో 105 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే అన్ని శాఖల్లోని ఖాళీల భర్తీకి అక్కడి ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో త్వరలోనే ముంపు మండలాలకు ఏపీ ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది.
ఆప్షన్‌లపై స్పష్టత కరువు :
ముంపు మండలాల్లోని వ్యవసాయశాఖ, పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఇటీవలే తెలంగాణకు బదిలీపై వచ్చారు. తాజాగా పంచాయతీ కార్యదర్శులు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో అవి నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉపాధ్యాయులు కూడా ఇదే రీతిన రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారుల నుంచి ఆదేశాలు తెచ్చుకొని తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ ఇలంబరితి ముంపు ఉద్యోగుల నుంచి తీసుకున్న అభిప్రాయాల మేరకు 1585 మంది తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చారు.
588 మంది ఉద్యోగులు ఆంధ్రలోనే పనిచేస్తామని వెల్లడించారు. దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టత లేకుండానే ఓ పక్క బదిలీలు, మరో పక్క నియామకాలు జరిగిపోతుండడంతో ముంపు మండలాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళన నెలకొంది. ఉద్యోగుల నుంచి తీసుకున్న ఆప్షన్‌ల మేరకు ముంపు ఉద్యోగుల పంపకాలు జరిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, కానీ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వకుండా ఆందోళనకు గురిచేయటం సరైంది కాదని ముంపు ఉద్యోగుల ఫోరమ్ సమన్వయ కర్త స్వరూప్ కుమార్ అన్నారు. దీనిపై మూడు జిల్లాల కలెక్టర్‌లు తగిన చొరవ చూపాలని కోరారు.
‘ముంపు’లో ఆంధ్ర ఉద్యోగులు
Published Wed, Nov 19 2014 2:07 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM
Advertisement
Advertisement