కేంద్రంలో చక్రం తిప్పేందుకే.. | Telangana Gets Benefitted, If 16 Mp Seats Win | Sakshi
Sakshi News home page

కేంద్రంలో చక్రం తిప్పేందుకే..

Published Mon, Mar 25 2019 3:05 PM | Last Updated on Mon, Mar 25 2019 3:31 PM

Telangana Gets Benefitted, If 16 Mp Seats Win - Sakshi

మహబూబాబాద్‌లో హాజరైన నాయకులు, కార్యకర్తలు

సాక్షి, మహబూబాబాద్‌: సీఎం కేసీఆర్‌ కేంద్రంలో చక్రం తిప్పేందుకే లోక్‌సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రంలో కీలకంగా మారితే రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావచ్చనే లక్ష్యంతోనే 16 స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్‌లో ఆదివారం ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అధ్యక్షతన పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకులతో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో వార్‌వన్‌సైడే ఉందికానీ మెజార్టీ కోసమే పాటుపడుతున్నామన్నారు. 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ డీలా పడిపోయిందని మళ్లీ కోలుకునే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌ పరిస్థితి చూసి చెందిన డీకే అరుణ, ఆనందభాస్కర్‌ లాంటి నాయకులు పార్టీని వీడారన్నారు.  కాంగ్రెస్‌ కార్యకర్తల కార్యకర్త ఇంటికి వెళ్లి కూడా ఓటు అడుగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ దేనికి కూడా పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి కన్పించడంలేదన్నారు. దేశంలో ఎక్కవ లేని పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. 

ఏప్రిల్‌ 4న సీఎం సభ..
వచ్చేనెల 4న మానుకోట జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం కేసీఆర్‌ సభ విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మానుకోట నియోజకవర్గం నుంచే 50వేల మందికి పైగా రావాలన్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన మండలం, గ్రామాలను దత్తత తీసుకుంటామని తెలిపారు. ఎంపీ సీతారాంనాయక్‌కు మంచి భవిష్యత్‌ ఉంటుందని సీఎం చెప్పారని బాధపడొద్దని అన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ నిధుల కోసమే సీఎం తాపత్రయపడుతున్నారని తెలిపారు. విభజన చట్టంలోని అంశాలను  బీజేపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారన్నారు.  మానుకోట జిల్లా రూపురేఖలు మారుతాయని తెలిపారు.

ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలను కీలకంగా తీసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌కు పోటీ లేదని మెజార్టీ కోసం కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవిత మాట్లాడుతూ.. సమయం తక్కువగా ఉన్నందున కార్యకర్తలు ప్రచారం ముమ్మరం చేయాలని కోరారు.  ఆడబిడ్డగా ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. మానుకోట నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, ఎం.రమేష్, నెహూర్రెడ్డి, మురళి, శ్రీకాంత్‌రెడ్డి, ఫరీద్, డోలి లింగుబాబు, డాక్టర్‌ నెహ్రూనాయక్, ముత్యం వెంకన్న, కెఎస్‌ఎన్‌రెడ్డి, ఎం రంగారావు ఖాసీం, చిట్యాల జనార్దన్, గడ్డం అశోక్, రఘు, బాలాజీ నాయక్, తేళ్ల శ్రీను, ఆవుల వెంకన్న పాల్గొన్నారు.

16 సీట్లు టీఆర్‌ఎస్‌వే ..
దామెర: 16 సీట్లు..కారు..కేసీఆర్‌వే అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆదివారం పరకాల నియోజకవర్గ స్థాయి ఎంపీ ఎన్నికల సన్నాహాక సమావేశం మండలకేంద్రం సమీపంలోని సైలానా బాబా దర్గ ఎదురుగా పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న  మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని తదనుగుణంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

16 సీట్లు గెలుచుకొని కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ద్వారా టీఆర్‌ఎస్‌ పార్టీ కీలకంగా మారి కేసీఆర్‌ ప్రధాని అవ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్ధిగా పోటీలో నిలిచిన పసునూరి దయాకర్‌ కు పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ  ఇవ్వాలని కోరారు. 70 ఏళ్ళ కాంగ్రెస్‌  చేయని అభివృద్ధి ఐదేళ్ల కేసీఆర్‌ పాలనలో జరిగిందన్నారు.  రైతుల గురించి ఎప్పుడైనా గత ప్రభుత్వాలు ఆలోచించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాగానే ఎస్‌ఆర్‌ఎస్పీ కెనాల్‌ ద్వారా పరకాల నియోజక వర్గానికి నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ 16 సీట్లు గెలిచి కేంద్రంలో కీలకంగా మారి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను, ఖాజీపేట్‌ రైల్వే డివిజన్‌ను, టెక్స్‌టైల్‌ పార్కుకు నిధులను సాధించుకోవచ్చునని పేర్కొన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే కేసీఆర్‌ పాలన ఆందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

వరంగల్‌ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ మొదటిసారిగా గెలిచిన తాను కొంత వరకు పనులు చేయడం జరిగిందని, కేసీఆర్‌ తనపై నమ్మకంతో రెండోసారి  అవకాశం ఇవ్వడం  జరిగిందని అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని తనను భారీ మెజారితో గెలిపించాలని  కోరారు. కార్యక్రమంలో కొంపెల్లి ధర్మరాజు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, పులి సారంగపాణి, జాకీర్‌ అలీ, పోలీస్‌ధర్మారావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సదానందం, నాగిరెడ్డి, దామెరుప్పుల శంకర్, కృపాకర్‌ రెడ్డి, రాజ్‌కుమార్, రమణారెడ్డి,గట్ల విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు..
కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీఫ్లోర్‌ లీడర్‌ మూలగుండ్ల వెంకన్న పలువురు సర్పంచ్‌లు సుష్మా , వెంకన్నతో పాటు పలువురు ముఖ్య నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి పార్టీ  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త పాత అనే తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తామన్నారు. కాని పార్టీ కోసం పని  చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యమని మెజారిటీ కోసమే పాటుపడాలని పిలుపునిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement