సాక్షి ,మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 31న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జిల్లాకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వనపర్తి జిల్లా నాగవరంలో సాయంత్రం 4గంటలకు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అదే రోజు సాయంత్రం 5:30కు మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఈ మేరకు శనివారం రాత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి లక్ష మందికి మించకుండా జనాన్ని తరలించే యోచనలో పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ లోక్‌సభ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డికి బదులు మన్నే శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం.. ఇప్పటి వరకు గెలుచుకోని నాగర్‌కర్నూల్‌పైనా గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఉన్న టీఆర్‌ఎస్ ప్రచార వ్యూహాలకు పదునుపెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment