సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్య పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 117 జిల్లాల్లో వైద్య ఆరోగ్యశాఖపరంగా చేపట్టాల్సిన వివిధ అంశాలను ఆధారంగా చేసుకొని ప్రత్యేకంగా కేంద్రీకరించింది. వీటిపై ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా సమీక్షిస్తారు. ప్రధానంగా ఆసుపత్రుల్లో ప్రసవాలు, తల్లిపాల ప్రాధాన్యం, ప్రజారోగ్య వ్యవస్థలో స్పెషలిస్టు వైద్య సేవలు, డయేరియా నివారణ, తక్కువ బరువుతో పిల్లలు పుట్టకుండా ముందస్తు చర్యలు తదితర ఎనిమిది అంశాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలను యాస్పిరేషనల్ జిల్లాలుగా గుర్తించింది. దేశవ్యాప్తంగా ఆ జిల్లాల్లో పైన పేర్కొన్న వివిధ అంశాల్లో ఏ మేరకు పురోగతి సాధించిందోనన్న విషయంపై రెండు సార్లు సర్వే నిర్వహించింది. ఆ సర్వేల్లో ఒక్క అంశంలో మినహా మిగిలిన అన్నింటిలోనూ తెలంగాణలోని ఆ మూడు జిల్లాలు మరింత పురోగతిలో ఉన్నాయని నిర్ధారించింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం పంపింది. మిగిలిన జిల్లాల్లోనూ వైద్య ఆరోగ్య పథకాలు భేషుగ్గా జరుగుతున్నాయని నీతి ఆయోగ్ పరిశీలకులు భావిస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు..
కేసీఆర్ కిట్‌ను ప్రవేశపెట్టాక రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 1,03,827 మంది శిశువులు జన్మించారు. మొత్తం ప్రసవాల్లో 59 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 41 శాతం ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగాయి. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్లనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వం గర్భిణీలకు రూ. 12 వేలు/రూ. 13 వేలు ప్రోత్సాహకం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు బిడ్డ పుట్టాక కేసీఆర్ కిట్ పేరుతో వివిధ రకాల వస్తువులను అందిస్తుంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. దేశంలోని 117 జిల్లాల్లో 17 జిల్లాల్లో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని నివేదికలో పేర్కొంది. అందులో తెలంగాణ జిల్లాలు లేకపోవడం గమనార్హం. ఇక గర్భిణీలకు ముందస్తు చెకప్‌లలో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఇక జిల్లా ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్య వసతులను కల్పించడంలోనూ తెలంగాణలోని ఆ మూడు జిల్లాలు మంచి పురోగతి సాధించాయి. దేశంలో 20 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.
తల్లిపాలు ఇవ్వడంలో వెనుకబాటు..
పుట్టిన గంటలోపే నవజాత శిశువుకు తల్లిపాలు పట్టించాల్సిన అవసరం ఉంది. అప్పుడే శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. కానీ తెలంగాణలోని ఆసిఫాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు మాత్రం ఈ రెండు సర్వేల్లో వెనుకబడి ఉన్నాయని నీతి ఆయోగ్ పేర్కొంది. మొదటి సర్వే కంటే రెండో సర్వే వచ్చే సరికి పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది.
వైద్య పథకాల అమలులో భేష్
Published Thu, Jun 13 2019 3:20 AM | Last Updated on Thu, Jun 13 2019 3:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment