సర్వదా సంక్షేమం
తెలంగాణ పాలనకు అధికారుల పనితీరే కీలకం
► క్షేత్ర స్థాయిలో సమస్యలపై దృష్టిపెట్టాలి
► దళితుల దారిద్య్రాన్ని పారదోలుదాం
► వ్యవసాయానికి పెట్టుబడి సాయం
► వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ
► నియోజకవర్గానికో రెసిడెన్షియల్ స్కూల్
► సలహాలు, సూచనల కోసం జిల్లాల్లో సదస్సులు
► వక్ఫ్ భూముల పరిరక్షణకు ప్రాధాన్యం
► జిల్లాకో స్టడీ సర్కిల్, సంక్షేమ హాస్టళ్లపై దృష్టి
► స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన
► కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్: ‘ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలి. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను తెలుసుకోవాలి. అన్ని వర్గాలకు స్ఫూర్తిదాయకంగా పనితీరు ఉండాలి. అన్ని వర్గాల సంక్షేమం, కేజీ టు పీజీ, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలి’ అని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శనం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు రెండో రోజున సంక్షేమ పథకాలు, విద ్య, ఉపాధి తదితర అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఒకట్రెండు రోజుల్లోనే జిల్లా స్థాయిలో ఆర్‌డీవో, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశమై ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించాలని కలెక్టర్లకు, ఎస్పీలకు సీఎం సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
దళితులకు దన్నుగా నిలవాలి: ‘దళిత కుటుం బాల దారిద్య్రాన్ని పారదోలడమే ప్రభుత్వ లక్ష్యం. వారికి భూ పంపిణీ చేసి వ్యవసాయం చేసేలా పోత్సహించాలి. ఎస్సీ, ఎస్టీ బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రతి కలెక్టర్ వద్ద రూ.కోటి నిధిని అందుబాటులో ఉంచుతాం. కలెక్టర్లు, ఇతర అధికారులు దళిత బస్తీలు, గిరిజన తండాల్లో కొంత సమయం గడిపితే వాస్తవాలు తెలుస్తాయి. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్లాట్లు రిజర్వు చేయాలి’ అని కేసీఆర్ నిర్దేశించారు. అలాగే జిల్లాకో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమంపై మంత్రులు, అధికారులు సమీక్ష జరిపి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు.
జిల్లాకో 2 మైనారిటీ స్కూళ్లు: ‘ప్రతి జిల్లాలో బాలబాలికలకు వేర్వేరుగా రెండు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలి. గృహనిర్మాణం, డీఆర్‌డీఏ పథకాల్లో ముస్లింల శాతాన్ని పెంచాలి. ముస్లింల అభ్యున్నతికి ఏం చేయాలో అధ్యయనం చేయాలి. కొత్త పథకాల రూపకల్పన చేయాలి. వక్త్ఫ్ భూముల వివరాలను కలెక్టర్లకు పంపిస్తాం. వాటి పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. వాటిని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు’ అని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.
హాస్టళ్లపై స్పెషల్ ఫోకస్: ‘సంక్షేమ హాస్టళ్లలో అవినీతిని సహించవద్దు. సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలి. పిల్లల అవసరాలను గుర్తించి అన్నీ అందుబాటులో ఉంచాలి. కాస్మోటిక్ చార్జీలను సమీక్షించి అవసరమైన మేరకు పెంచుతాం. నెలలో ఒకరోజు హాస్టల్ డే నిర్వహించాల’ని సీఎం సూచించారు.
అందరికీ విద్య సర్కారు లక్ష్యం: ‘నిర్బంధ ఉచిత విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యం. కులాల అంతరాలు లేకుండా పిల్లలంతా ఒకే చోట విద్యనభ్యసించాలి. తెలుగును విస్మరించకుండానే ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన జరగాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
నిర్వాసితులను ఖాళీ చేయించండి: హరీశ్
‘కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టినా నిర్వాసితులు ఖాళీ చేయకపోవటంతో అవి ఉపయోగంలోకి రావట్లేదు. కల్వకుర్తి, ఎల్లంపల్లి, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలోని నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాం. వెంటనే వారిని ఖాళీ చేయించి రిజర్వాయర్లలో నీటిని నింపాల’ని మంత్రి హరీశ్‌రావు కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రమంతటా స్వచ్ఛభారత్
పరిశుభ్రమైన పట్టణాలు, గ్రామాలు అత్యంత అవసరమని, ఈ దిశగా వచ్చే నెల 8 లేదా 10 నుంచి భారీ ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని 400 భాగాలుగా విభజించి సీఎం సహా మంత్రులు, అధికారులకు ఒక్కో ప్రాంతంలో పారిశుద్ధ్య బాధ్యతలను అప్పగిస్తామన్నారు. గవర్నర్ కూడా ఇందులో పాల్గొంటారని చెప్పారు. జిల్లాల్లోనూ స్వచ్ఛ భారత్‌ను పాటించేందుకు కలెక్టర్లు సన్నద్ధం కావాలని, తగినంత మంది నోడల్ అధికారులను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలి. అన్ని వర్గాలకు స్ఫూర్తిదాయకంగా పనితీరు ఉండాలి. అన్ని వర్గాల సంక్షేమం, కేజీ టు పీజీ, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలి.
- అధికారులో సీఎం కేసీఆర్