10 లక్షల మంది లబ్ధిదారులు
ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయండి: కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు అవసరమైన అధికారాలు, స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం ఎక్కువగా కలెక్టర్లపైనే ఆధారపడుతుంది. అందుకే చిత్తశుద్ధితో మీరందరూ బాధ్యతలు నిర్వర్తించాలి. మీ విలువైన సమయంలో ప్రతిరోజు ఒక కార్యక్రమంపై ఒక గంట వెచ్చించాలి. వారానికో పథకంపై దృష్టి సారించాలి...’’అంటూ కలెక్టర్లకు మార్గదర్శనం చేశారు.
‘‘రాబోయే రోజుల్లో గొర్రెల పెంపకం, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులు.. మొత్తంగా 10 లక్షల మంది అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలి. రాజకీయ పైరవీలకు తావు లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి’’అని సూచించారు. సోమవారమిక్కడ ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన అన్ని జిల్లాల కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రసంగించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు టి.హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, కె.తారక రామారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
‘డబుల్’లో పారదర్శకత పాటించాలి..
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో, తహసీల్దార్ల సహకారంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని, పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. గ్రామ సభలోనే లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అవసరమైతే ఆధార్ కార్డును అనుసంధానం చేయాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. ఏ గ్రామంలో ఎన్ని ఇళ్లను కట్టాలనేది ఎమ్మెల్యేలు సూచిస్తారని చెప్పారు.
మాంసం ఎగుమతులకు హబ్‌గా మారాలి
రాష్ట్రాన్ని మాంసం ఎగుమతుల హబ్‌గా మార్చాలని సీఎం ఆకాంక్షించారు. ‘‘గొర్రెల పెంపకం కార్యక్రమం భవిష్యత్తులో తెలంగాణకు శాశ్వత ఆర్థిక ప్రక్రియగా నిలుస్తుంది. ఈ ఏడాది జూన్ నుంచే గొర్రెల పంపిణీ ప్రారంభమవుతుంది. రూ.1.25 లక్షల విలువైన యూనిట్ ధరలో 75 శాతం ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. మిగతా 25 శాతం లబ్ధిదారులు చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండానే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. నాలుగున్నర లక్షల మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. త్వరలోనే సొసైటీలలో కొత్త సభ్యులను చేర్పించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18 సంవత్సరాలు దాటిన గొల్ల కుర్మలు రూ.51 రుసుముతో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇప్పుడున్న సొసైటీల్లోనే కొత్త సభ్యులను చేర్పించాలా? కొత్త సభ్యులకు కొత్త సొసైటీలు ఏర్పాటు చేయాలా? అనేది కలెక్టర్లే తేల్చాలి. ఇతర రాష్ట్రాల్లో గొర్రెలు కొనేందుకు సొసైటీ సభ్యులను కూడా తీసుకెళ్తే మంచిది’’అని సూచించారు.
జూన్ 2 న ఒంటరి మహిళలకు భృతి
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఒంటరి మహిళలకు భృతి, కేసీఆర్ కిట్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ‘‘ఒంటరి మహిళలను గుర్తించడం క్లిష్టమైన అంశం. ఏడాదికి పైగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళను ఒంటరి మహిళలుగా గుర్తించాలి. వారిలో ఎక్కువ మంది పేదలే ఉంటారు. ప్రభుత్వం ఇచ్చే భృతి వారిని ఆర్థికంగా ఆదుకుంటుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలను గుర్తించడం తేలిక. పట్టణ ప్రాంతాల్లోనూ సమర్థవం తంగా గుర్తించాలి. రాష్ట్రంలో రెండున్నర నుంచి మూడు లక్షల మంది వరకు ఒంటరి మహిళలు ఉం టారని అంచనా. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను వెంటనే చేపట్టాలి’’అని సీఎం ఆదేశించారు.
పేద గర్భిణుల కష్టాలు తీరాలి..
నెలలు నిండిన పేద గర్భిణీలు కూలీ పనులకు వెళ్తూ కష్టాలు పడుతున్నారని, ఈ పరిస్థితి మారాలని సీఎం అన్నారు. ‘‘వారికి ప్రసవ సమయంలో జీవనోపాధిగా ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ లక్ష్యం. గర్భిణుల పేర్ల నమోదుకు ఏఎన్‌ఎంల సేవలను ఉపయోగించుకోవాలి. 12వ వారం ప్రవేశించిన వెంటనే నమోదు ప్రక్రియ చేపట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి. రూ.12 వేల ఆర్థిక సాయంతో పాటు రూ.2 వేల కేసీఆర్ కిట్ వారికి అందిస్తాం. ఆడపిల్ల పుడితే మరో రూ.వెయ్యి అదనంగా ఇస్తాం. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసూతి సేవలు మెరుగుపరుస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో డాక్టర్ల కొరత ఉన్నట్లు కలెక్టర్లు చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు అందిం చాలి. ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల సహకారాన్ని కోరాలి. అవసరమైనచోట కాంట్రాక్టు పద్ధతిలో వైద్య సిబ్బందిని నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం. ఆశా వర్కర్లను కూడా కేసీఆర్ కిట్స్ కార్యక్రమంలో వినియోగించుకోవాలి’’అని సీఎం చెప్పారు.
బీడీ కార్మికులను గుర్తించండి..
ప్రావిడెంట్ ఫండ్ పరిధిలో ఉన్న 81 వేల మంది బీడి కార్మికులను పెన్షన్లకు అర్హులుగా గుర్తించాలని సీఎం పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఎంతో బాగుంది. 2016–17 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రాష్ట్ర సొంత పన్నుల వాటా 21 శాతం వృద్ధి సాధిం చింది. 19.5 శాతం వృద్ధిరేటు ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ధారించింది. రాష్ట్రంలో ఆదాయ వృద్ధి రేటు 15 శాతానికి తగ్గే అవకాశం లేనే లేదు’’అని వివరించారు.
ఏడాదిలోగా కలెక్టరేట్లు, పోలీస్ ఆఫీసులు
ఏడాదిలోగా జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ సముదాయాల నిర్మాణం, వచ్చే ఏడాది నుంచి వాటిలో పని జరగాలని సీఎం ఆదేశించారు. పోలీస్ కార్యాలయాల సముదాయాలను పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ద్వారా నిర్మిస్తామని చెప్పారు.
పట్టణాలపై దృష్టి పెట్టండి: కేటీఆర్
రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కలెక్టర్లకు వివరించారు. బడ్జెట్‌కు అతీతంగా రూ.5 వేల కోట్లు కేటాయించగా, అందులో రూ.1000 కోట్లు జీహెచ్‌ఎంసీ మినహా ఇతర మున్సిపాలిటీలకు వెచ్చిస్తామన్నారు. కలెక్టర్ల అధ్వర్యంలో ఈ నిధులను ప్రజారోగ్యశాఖ ఖర్చు చేస్తుందని చెప్పారు. పారిశుధ్యం, డంప్ యార్డులు, పబ్లిక్ టాయ్‌లెట్లు, చెత్త బుట్టల పంపిణీ, కార్పొరేషన్ల పరిధిలో రోడ్ల వెడల్పు, బస్ బేలు, మార్కెట్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు.
సాదా బైనామాలపై పర్యవేక్షణ
సాదా బైనామాల క్రమబద్ధీకరణను అకారణంగా తిరస్కరించవద్దని సీఎం కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రస్థాయి నుంచి సీనియర్ అధికారుల బృందం ఏదో ఒక జిల్లాకు వెళ్లి సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించాలని ఆదేశించారు. రెవెన్యూ విధానాలను మరింత సులభతరం చేసేందుకు అధ్యయనం జరగాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయించిన నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిటీలు ప్రతి జిల్లాలో పర్యటి స్తాయని, నిధులు వినియోగించిన వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.