సాక్షి, హైదరాబాద్: ఆదర్శ రైతు వ్యవస్థను రద్దుచేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఆ వ్యవస్థ స్థానే సాంకేతికంగా అర్హులైన సహాయ వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతుల అవసరాలు తీర్చాలని సూచించింది. వ్యవసాయ, ఉద్యానవన కోర్సుల్లో డిప్లొమా చదివిన వారిని నియమించి రైతులకు అవసరమైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కోరింది. ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వుతో రాష్ట్రంలోని 16,841 మంది ఆదర్శ రైతులను తొలగించినట్లయింది.