ఎర్టిగా కాదు.. ఇన్నోవాలే ముద్దు!
జంట కమిషనరేట్లకు పోలీసులకు సరికొత్త వాహనాలను సమకూర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి.. ఇన్నోవాలనే ఎంచుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు రెండింటికీ కలిపి వంద వరకు వాహనాలు కావాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే దాదాపు 1500 కార్లు కావల్సి వస్తాయన్నారు. ముందుగా ఇన్నోవా వాహనాలు తీసుకోవాలని భావించారు. ఆ తర్వాత మారుతి కంపెనీ ప్రతినిధులు వచ్చి సీఎం కేసీఆర్ను కలిశారు. ఇన్నోవాది, తమది దాదాపు ఒకటే డిజైన్ అని, సీట్ల సామర్థ్యం కూడా సమానంగా ఉంటుందని చెప్పారు.
అయితే ఇన్నోవా ఖరీదు దాదాపు రూ. 16 లక్షలు కాగా ఎర్టిగా మాత్రం దాదాపు 10 లక్షలకే వస్తుందని, పైగా, ఇన్నోవా కంటే ఎర్టిగా ఎక్కువ మైలేజీ ఇస్తుందని మారుతి కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. తమ వాహనం ఖరీదు చేస్తే రూ.6 లక్షల మిగులుతో పాటు మైలేజ్ కలసివస్తుందని ప్రతిపాదించారు. పోలీస్ స్టిక్కర్లతో డిజైన్ చేసిన కొన్ని ఎర్టిగా కార్లను ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులకు చూపించి వాటి పనితీరును వివరించారు. ఒక్కో వాహనానికి 6 లక్షల చొప్పున జంట కమిషనరేట్లలోని వంద వాహనాలకే 6 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉండేది. మొత్తం 1500 కార్లకు అయితే దాదాపు 90 కోట్ల వరకు మిగిలిది. అయితే ఎందుకో గానీ.. ఎర్టిగాకు బదులు ఇన్నోవాలనే తెలంగాణ సర్కారు ఎంచుకుంది. దాంతో ఇన్నోవాలే గురువారం నాటి పెరేడ్లో దర్శనమిచ్చాయి.
కొసమెరుపు: ఈ కొత్త వాహనాలను పెరేడ్ చేసిన తొలిరోజే ఓ ఇన్నోవా స్వల్ప ప్రమాదానికి గురైంది. ఇందులో ఎవరికీ గాయాలు కాకపోయినా వాహనం ముందుభాగం మాత్రం కొద్దిగా దెబ్బతింది. ఇంజన్ భాగంలోంచి కొంత ఆయిల్ కారింది.