రుణ మాఫీపై రీషెడ్యూల్ బాట..!
Published Thu, Jul 10 2014 3:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
చెల్లింపు భారం తగ్గించుకునే యోచనలో టీ సర్కారు
గత ఏడాది కరువు, తుపాను పీడిత మండలాల్లోని
రైతు రుణాలపై దృష్టి.. 323 మండలాల నిర్ధారణ
సమగ్ర వివరాలతో ఒకట్రెండు రోజుల్లోనే ఆర్‌బీఐకి నివేదిక
సుమారు 72శాతం రుణాల రీషెడ్యూల్‌కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రైతు రుణాల మాఫీ భారాన్ని భరించేందుకు ఉన్న మార్గాలపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. రుణ మాఫీకి ఆర్‌బీఐ సానుకూలంగా లేకపోవడంతో రుణాల రీ-షెడ్యూల్‌పై రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది. కరువు మండలాల రైతులకు దీన్ని వర్తింపజేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీంతో దాదాపు 72 శాతం పంట రుణాలు రీ-షెడ్యూల్ అయ్యే అవకాశముందని అంచనా. రీ-షెడ్యూల్‌తో రైతులకు తక్షణ భారం తగ్గడమే కాకుండా, వారికి వెంటనే కొత్త రుణాల మంజూరు కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ఆ మేరకు రుణ మాఫీ మొత్తాన్ని కూడా బ్యాంకులకు ప్రభుత్వం వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కూడా కలుగుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన హామీని అమలు చేసేందుకు ఈ ప్రత్యామ్నాయంపైనే అధికారులు దృష్టి సారించారు. ఇందులోభాగంగా తెలంగాణలో గత ఏడాది కరువు, తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన మండలాల్లోని రైతులకు సంబంధించిన రుణాల రీ-షెడ్యూల్ నివేదికను ఒకట్రెండు రోజుల్లో ఆర్‌బీఐకి పంపించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కూడిన మిగతా 2వ పేజీలో ఠ
బృందం గత వారం ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. రుణాల రీ-షెడ్యూల్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారంతో పాటు.. రుణ మాఫీపై రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. దీనిపై సమగ్ర నివేదిక పంపించాలని, రీ-షెడ్యూల్ ను పరిశీలిస్తామని చెప్పడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణలో మొత్తం 443 మండలాల్లో దాదాపు 323 మండలాలు తుఫాను, కరువుతో బాగా దెబ్బతిన్నట్లు నిర్ధారిస్తూ ప్రభుత్వం గత జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా మండలాల్లోని రైతులు తీసుకున్న రుణాలపై బ్యాంకుల నుంచి సవివర నివేదికలు తెప్పించుకుంది. తాజాగా వీటి రీ-షెడ్యూల్‌కు రాష్ర్ట ప్రభుత్వం ఆర్‌బీఐకి నివేదించనుంది. వాస్తవంగా పంట రుణాలు మాత్రమే రీ-షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని, బంగారు తాకట్టు రుణాలను పరిగణించరని ఓ అధికారి తెలిపారు.
అయితే బంగారు తాకట్టు రుణాలను కూడా పంట రుణాలను కూడా రీ-షెడ్యూల్ చేయాలని ఆర్‌బీఐని తెలంగాణ సర్కారు కోరుతోంది. పంట రుణాలు, బంగారు తాకట్టు రుణాలు మొత్తం దాదాపు 17,332 కోట్ల మేరకు ఉంటాయని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. వీటిలో కరువు మండలాల రైతులకు చెందిన 72 శాతం రుణాలు అంటే దాదాపు రూ. 12,479 కోట్ల రుణాలు రీ-షెడ్యూల్ అవుతాయని భావిస్తున్నారు. ఇక కరువు, తుఫాను మండలాల జాబితాలో లేని మిగతా ప్రాంతాల రైతులకు రుణాల రీ-షెడ్యూల్ వర్తించదు. వారికి కొత్త రుణాలు ఎలా ఇప్పించాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఈ మండలాల్లో రుణాలు సుమారు రూ. 4,853 కోట్లు ఉంటాయని చెబుతున్నారు. రీ-షెడ్యూల్ వర్తించని రైతుల వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. వీటిని కూడా రిజర్వ్‌బ్యాంకుకు పంపించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. మొత్తం రుణాలు రీ-షెడ్యూల్ చేస్తారా? ఒకవేళ చేస్తే.. వాటిని ఎంత కాలంలోగా తిరిగి చెల్లించాలి? తదితర విషయాలను ఆర్‌బీఐ తన ప్రకటనలో స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా, కరువు, తుఫాన్లు సంభవించిన 90 రోజుల్లో ఆ మండలాల పేర్లను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రకటన జాప్యమైనందు వల్ల నిబంధన లు సడలించాలని కూడా ప్రభుత్వం కోరుతోంది.
రీ-షెడ్యూల్‌కు ఆర్‌బీఐ నిబంధనలు - తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలు
ని:- కరువు, తుఫాను బాధిత మండలాల ప్రకటన తర్వాత 90 రోజుల్లో రీ షెడ్యూల్ చేసుకోవాలి.
అ:- 90 రోజుల గడువు దాటినందున ప్రత్యేక మినహాయింపునివ్వాలి.
ని:- రీ షెడ్యూల్ కోరుతూ రైతులు సంతకాలు చేయాలి.
అ:- రైతుల తరఫున ప్రభుత్వమే సంతకం చేస్తుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి బదలాయించాలి.
ని:- రీ షెడ్యూల్ గడువు తర్వాత బకాయిలను రైతులు చెల్లించాలి.
అ:- గడువు తీరాక రైతుల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది.
ని:- రీ షెడ్యూల్ వల్ల రైతులకు సబ్సిడీ వడ్డీ రేట్లు వర్తించవు.
అ:- రీ షెడ్యూల్ వల్ల పడే వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది.
ని:- లక్ష రూపాయల కంటే ఎక్కువ రుణం ఉంటే.. భూమి తనఖా పెట్టాలి.
అ:- తెలంగాణ ప్రభుత్వం లక్షలోపు రుణాలకు మాత్రమే హామీ ఇచ్చింది.
ని:- కరువు, తుఫాన్లతో దెబ్బతిన్న పంటలను బట్టి మూడు, ఐదు. ఏడు, పదేళ్ల రీషెడ్యూల్‌కు అవకాశం.
అ:- ఏడేళ్ల వ్యవధి ఇవ్వండి.
Advertisement
Advertisement