సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె పదో రోజున టీఆర్‌ఎస్ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చేసిన ప్రకటన కీలక మలుపు తిప్పనుందా? చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలంటూ కేకే ప్రకటన విడుదల చేయడం. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం వంటి పరిణామాలు సోమవారం ఆసక్తి రేకెత్తించాయి. కార్మికులు సమ్మె విషయంలో మొండివైఖరి విడనాడాలని, విలీనం మినహా ఇతర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలంటూ కేకే ప్రకటన చేశారు. ఈ ప్రకటన విడుదల చేసి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన కేకే... రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన దరిమిలా మంగళవారం చర్చలకు సానుకూల వాతావరణం ఉందని అధికార పార్టీ నేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మరోవైపు సమ్మె పదో రోజున కార్మికులు అన్ని డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో బైఠాయించి నిరసన తెలియజేశారు. జేఏసీ నేతలు గవర్నర్‌ను కలసి తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment