తెలంగాణలోను వయో పరిమితి పెంపు !
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే పరీక్షలు రాసే ఉద్యోగుల వయో పరిమితి పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తుంది. అలాగే పరీక్ష విధానంలో కూడా సమూలమైన మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఈ అంశాలపై వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రభుత్వానికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశాల అమలు సాధ్యాసాధ్యాలపై మేధావులు, విద్యావంతులతో ప్రభుత్వం చర్చిస్తుంది.
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారీ ఎత్తున ప్రభుత్వ కలువులు భర్తీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫేస్టోలో వెల్లడించింది. ఎన్నికల్లో ఆ పార్టీ విజయఢంకా మోగించి.. అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 60 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించింది. దీంతో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఆ క్రమంలో వారు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం దిగి వచ్చింది. అదికాక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం... ఉద్యోగ వయో పరిమితిని 36 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ చేసిన విషయం విదితమే. దీంతో ఆదే దిశగా కేసీఆర్ సర్కార్ కూడా ఆలోచన చేస్తుందని సమాచారం. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీలోగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే పరీక్షలు, ఉద్యోగాల భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందని సమాచారం.