ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో డోర్లు లేకుండా ఉన్న స్నానాల గది
ఖమ్మంమయూరిసెంటర్: రెండు రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచే ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను సైతం ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. రెండు నెలలుగా విద్యార్థులు లేక మూసి ఉన్న హాస్టళ్లను శుభ్రం చేయడంతో పాటు వసతిగృహాల్లో నెలకొన్న ఇతర సమస్యలను పరిష్కరించాలి. అయితే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వాటి పరిష్కారానికి అధికారులు చేపడుతున్న చర్యలు శూన్యం. ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను గుర్తించి, మరమ్మతులకు అంచనాలు రూపొందించాలని ఆ శాఖ అధికారులు ఇంజనీరింగ్ శాఖకు లేఖలు రాసి, తమ పని అయిపోయిందన్నట్టుగా చేతులు దులుపుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యా గుర్తించలేదు.
బీసీ వసతిగృహాల్లోనూ సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. గతంలో ‘సాక్షి’ నిర్వహించిన హాస్టళ్ల సందర్శనలో బీసీ వసతి గృహాల్లో.. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలోని వసతిగృహాల్లోనే అత్యధిక సమస్యలు దర్శనమిచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని అధికారులు చెపుతున్నా.. ఇప్పటి వరకు ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు పనులు చేపట్టినప్పటికీ కొన్ని కూడా పూర్తి కాలేదు. హాస్టళ్ల కిటికీలకు తలుపులు కూడా లేవు. మరో రెండు రోజుల్లో విద్యార్థులు వసతిగృహాలకు వస్తున్నా.. పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో సమస్యలు పరిష్కారమవుతాయా అనే ప్రశ్న విద్యార్థి సంఘాల్లో తలెత్తుతోంది.
ప్రారంభం కాని మరమ్మతులు..
విద్యా సంవత్సరం ప్రారంభానికి రెండు రోజులే సమయం ఉండడం, వేసవి సెలవులు ముగించుకొని నూతనోత్సాహంతో ఇంటి నుంచి వసతిగృహాలకు వచ్చే విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకనున్నాయి. ప్రతి ఏడాది వేసవిలోనే హాస్టళ్లలో సమస్యలను గుర్తించి, మరమ్మతుల కోసం ఆయా శాఖల అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఎస్సీ వసతిగృహాల్లో సమస్యలను గుర్తించాలని ఇంజనీరింగ్ అధికారులకు లేఖలు పెట్టినా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేకపోవడంతో వసతిగృహాల్లో సమస్యలు తప్పేలా లేవు. బీసీ హాస్టళ్లలో సమస్యలను గుర్తించినా.. ఇంతవరకు మరమ్మతు చర్యలేమీ చేపట్టలేదు. ఇక గిరిజన వసతిగృహాల్లో సైతం సమస్యలకు కొదవలేదు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించినప్పటికీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ మూడు శాఖల వసతిగృçహాలు, ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య ప్రధానంగా ఉంది. అద్దె భవనాల్లో ఉన్న వసతిగృహాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల సంక్షేమాధికారులు శ్రద్ధ చూపించకపోవడంతో మరమ్మతుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమయం పొడిగించినా ఫలితం లేదు..
2019 – 20 విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రభుత్వం ఈనెల 12న పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికి కొద్ది సమయం దొరికిందని అధికారులు భావించినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వసతిగృహాల్లో సమస్యలివే..
వసతిగృహాల ప్రారంభంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల్లో మొదటిది మరుగుదొడ్ల శుభ్రత. వసతిగృహాలు ప్రతి రోజు నిర్వహించే సమయంలోనే వీటిని శుభ్రం చేసే వారు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రెండు నెలలు మూసి ఉంచిన అనంతరం తెరుస్తుండడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మరో ప్రధాన సమస్య తాగునీరు. గత్యంతరం లేని స్థితిలో విద్యార్థులు స్నానాలకు ఉపయోగించే నీటినే తాగిన విషయం గతంలో అనేక సార్లు బహిర్గతం అయింది. ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఈ సమస్య మళ్లీ ఉత్పన్నమయ్యేలా ఉంది. ఇక వాడుకునే నీరు సైతం అపరిశుభ్రంగానే ఉంది.
జిల్లాలో వసతిగృహాల సంఖ్య ఇలా..
జిల్లాలో ఎస్సీ వసతిగృహాలు 50 ఉండగా వాటిలో కళాశాల స్థాయి 11 ఉన్నాయి. ఇందులో బాలురు 6, బాలికలకు 5 ఉన్నాయి. పాఠశాల స్థాయి వసతిగృహాలు 39 ఉండగా వీటిలో బాలురకు 25, బాలికలకు 14 కేటాయించారు. ఇందులో నేలకొండపల్లి బారుల వసతి గృహం ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. బీసీ వసతిగృహాలు 33 ఉండగా కళాశాల స్థాయి 10 ఉన్నాయి. ఇందులో బాలురవి 5, బాలికలవి 5. పాఠశాల స్థాయి వసతిగృహాలు 23 ఉండగా బాలురకు 18, బాలికలకు 5 కేటాయించారు. ఇందులో 10 హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 19 వసతిగృహాలు ఉండగా కళాశాల స్థాయి 12 ఉన్నాయి. వీటిలో బాలురకు 6, బాలికలకు 6 కేటాయించారు. పాఠశాల స్థాయిలో 7 ఉండగా బాలురకు 5, బాలికలకు 2 ఉన్నాయి. ఇక ఆశ్రమ పాఠశాలలు 11 ఉండగా బాలురకు 4, బాలికలకు 7 కేటాయించారు. వీటిలో 4 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
సమస్యలు గుర్తించడంలో నిర్లక్ష్యం..
వసతిగృహాల్లో సమస్యలను గుర్తించడంలో సంక్షేమశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యా సంవత్సరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ వసతిగృహంలో చూసినా ఏదో ఒక సమస్య విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదు. – ఎన్.ఆజాద్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి
సమస్యలు గుర్తించినా మరమ్మతులు లేవు
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వసతిగృహాల సందర్శన నిర్వహించి సమస్యలను గుర్తించాం. వాటిని నివేదిక రూపంలో తయారు చేసి ఆయా శాఖల అధికారులకు అందించాం. సమస్యలను వారికి విన్నవించినా పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారు. గుర్తించిన సమస్యలను మరమ్మతులు చేసి పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. – టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment