ఎగ్జిక్యూటివ్ పోస్టులపై సర్కారుదే నిర్ణయం | telangana govt to take decision on group-2 executive posts | Sakshi
Sakshi News home page

ఎగ్జిక్యూటివ్ పోస్టులపై సర్కారుదే నిర్ణయం

Published Fri, Jan 30 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

ఎగ్జిక్యూటివ్ పోస్టులపై సర్కారుదే నిర్ణయం

ఎగ్జిక్యూటివ్ పోస్టులపై సర్కారుదే నిర్ణయం

గ్రూపు-1బీలో ఉంచాలా.. గ్రూపు-2లో కొనసాగించాలా?
ఇంటర్వ్యూల నిర్వహణపైనా ప్రభుత్వమే తేల్చాలి
పోటీ పరీక్షల విధానంపై సమీక్షా కమిటీ నిర్ణయం
గ్రూప్-1, గ్రూపు-4 పరీక్షల్లో మార్పులుండవ్
గ్రూప్-2లో డిస్క్రిప్టివ్ విధానానికి మొగ్గు
తెలంగాణ సంబంధిత అంశాలతో సిలబస్ మార్పులు
5న టీఎస్‌పీఎస్‌సీకి తుది నివేదిక ఇచ్చేందుకు కసరత్తు


సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టుల విషయంలో తుది నిర్ణయాన్ని రాష్ర్ట ప్రభుత్వానికే వదిలేయాలని పోటీ పరీక్షల విధానం(స్కీం)పై ఏర్పాటైన సమీక్షా కమిటీ నిర్ణయించింది. ఈ పోస్టులను గ్రూప్-1బీగా పరిగణిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఒకవేళ గ్రూప్-1బీగా కొనసాగిస్తే వాటికి ఇంటర్వ్యూలు నిర్వహించే అంశాన్నీ సర్కారుకే వదిలేయాలని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.

గురువారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) కార్యాలయంలో ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని సమీక్ష కమిటీ సమావేశమైంది. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నిర్వహించబోయే వివిధ పోటీ పరీక్షల విధానాన్ని ఈ భేటీలో దాదాపుగా ఖరారు చేసింది. గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ఇక గ్రూప్-2లో డిస్క్రిప్టివ్ విధానం ఉండాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరకు ఆ విధానాన్ని పెడితేనే బాగుంటుందన్న ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది.

వివిధ అంశాలను మరోసారి సమీక్షించి, వచ్చే నెల 5న టీఎస్‌పీఎస్‌సీకి తుది నివేదిక అందజేయాలని నిర్ణయించింది. అలాగే అన్ని పోటీ పరీక్షల సిలబస్‌లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, రాజకీయ, భౌగోళిక, ఆర్థిక, చారిత్రక అంశాల స్థానంలో తెలంగాణ అంశాలను చేర్చాలని నిర్ణయించింది. పరీక్షల విధానం, సిలబస్‌పై ప్రభుత్వామోదం తీసుకున్న తర్వాత ప్రకటించాలని టీఎస్‌పీఎస్‌సీ భావిస్తోంది. కాగా, గతంలో గ్రూప్-2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూల ద్వారా, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రాత పరీక్ష ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగేది. అయితే 2012లో అప్పటి సీసీఎల్‌ఏ జె.సత్యనారాయణ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు ఏపీపీఎస్సీలో పలు సంస్కరణలు సూచించింది.

ఈ నివేదిక ఆధారంగా గ్రూప్-2లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల కు ఇంటర్వ్యూలను తొలగిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదేసమయంలో మరో జీవో ద్వారా గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్పు చేసింది. వీటిని 2013 నుంచి అమలయ్యేలా ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఉత్తర్వులను అమలు చేయాలా.. లేక అంతకుముందున్న పాత విధానాన్నే కొనసాగించా లా అన్నది రాష్ర్ట ప్రభుత్వం తేల్చాల్సి ఉంది.

పరీక్ష విధానంలో మార్పులపై దృష్టి
పోటీ పరీక్షల విధానంలో మార్పులపైనే తాము  దృష్టి సారించామని సమీక్ష కమిటీ చైర్మన్ ప్రొ. హరగోపాల్ తెలిపారు. కమిటీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షల సిలబస్‌లో మార్పులకు సమయం పడుతుందని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అనుగుణంగా మార్పులు ఉంటాయని, నోటిఫికేషన్ల జారీ కంటే ముందే సిలబస్‌లో మార్పులను టీఎస్‌పీఎస్‌సీ ప్రకటిస్తుందని తెలిపారు. పరీక్షలు ఆలస్యమవుతున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement