
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్‌ను అమలు చేయడంపై రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) దృష్టి సారించింది. ఇప్పటికే స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. మరిన్ని కీలక మార్పులపై కసరత్తు చేస్తోంది. వార్షిక క్యాలెండర్‌ను, స్టేట్ సివిల్ సర్వీసెస్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలోనే అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది. మొత్తంగా ఎప్పుడు ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందోనని నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేయాలని భావిస్తోంది.
కసరత్తు మొదలు..
ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ విషయంలో ఒక్కో శాఖ ఒక్కోలా వ్యవహరిస్తోంది. ఒక్కో సమయంలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతోంది. దీంతో పలు శాఖల్లో చాలా కాలం పాటు పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. భర్తీ సమయంలోనూ గందరగోళం నెలకొంటోంది. ఈ పరిస్థితికి çఫుల్‌స్టాప్ పెట్టాలన్న యోచనతో వార్షిక క్యాలెండర్ అమలుకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ దిశగా టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఒక సంవత్సర కాలంలో ఏయే శాఖల్లో, ఏయే కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఖాళీ అవుతాయనే జాబితాలు తీసుకుని... ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల తేదీలు, దరఖాస్తులు, పరీక్షలు, ఫలితాల వెల్లడి షెడ్యూల్‌ను సిద్ధం చేసేలా కసరత్తు చేస్తోంది.
స్టేట్ సివిల్ సర్వీసెస్‌పైనా..
స్టేట్ సివిల్ సర్వీసెస్ అమలుపైనా టీఎస్‌పీఎస్సీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్టేట్ సివిల్ సర్వీసెస్, కామన్ సిలబస్ విధానం ఉంది. ఆయా రాష్ట్రాల్లో గ్రూప్–1, గ్రూప్–2 వంటి పరీక్షలకు సిద్ధమయ్యేవారు అటు సివిల్స్ పరీక్షలూ రాయగలిగేలా కామన్ సిలబస్‌ను రూపొందించారు. ఆ తరహాలోనే రాష్ట్రంలోనూ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటుపై మాజీ వీసీ రామకృష్ణయ్య నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జాయింట్ సివిల్ సర్వీసెస్ పేరుతో పలు ప్రతిపాదనలు చేయగా.. టీఎస్‌పీఎస్సీ వాటిని ప్రభుత్వానికి పంపింది. సర్కారు ఆమోదం లభిస్తే.. వెంటనే అమల్లోకి తేవాలని భావిస్తోంది.
సర్కారుకు ప్రతిపాదించిన అంశాలివీ..
♦ గ్రూప్–1, గ్రూప్–2లను స్టేట్ సివిల్ సర్వీసెస్ కిందకు తీసుకురావాలి.
♦ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారానే ఈ రెండు రకాల పోస్టులను భర్తీ చేయాలి (రెండింటికి వేర్వేరు పరీక్షలు కాదు).
♦ సిలబస్ యూపీఎస్సీ సిలబస్‌తో 75 శాతం వరకు సమానంగా ఉండాలి. దీనివల్ల వారు సివిల్స్ రాయడం, సివిల్స్‌కు సిద్ధమయ్యే వారు ఈ పరీక్షలు రాయడం సులభమవుతుంది.
♦ స్టేట్ సబార్డినేట్ సర్వీసు కింద గ్రూప్–3, గ్రూప్–4 పోస్టులను ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment