‘దిశ’ నిందితులకు రీ పోస్టుమార్టం | Telangana HC Issues Order To Re Post Mortem Disha Case Accused | Sakshi
Sakshi News home page

‘దిశ’ నిందితులకు రీ పోస్టుమార్టం

Published Sun, Dec 22 2019 1:58 AM | Last Updated on Sun, Dec 22 2019 2:01 AM

Telangana HC Issues Order To Re Post Mortem Disha Case Accused - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ అత్యాచార నిందితుల మృతదేహాలకు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్య నిపుణులతో తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లోని ముగ్గురు సీనియర్‌ ఫోరెన్సిక్‌ వైద్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి. నలుగురి మృతదేహాలకు ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పోస్టుమార్టం నిర్వహిం చాలి. మృతదేహాల వారీగా నివేదికివ్వాలి.

కమిటీని తక్షణమే పంపాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎయిమ్స్‌ను కోరాలి. వైద్యుల కమి టీకి ప్రయాణ ఖర్చులు, బస మొదలైన వాటిని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు వీడియో చిత్రీకరణ చేయాలి. దాన్ని సీడీ లేదా పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు అందజేయాలి. రెండోసారి పోస్టుమార్టం పూర్తి చేశాక మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పోలీ సుల సమక్షంలో గాంధీ ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ అప్పగించాలి.

ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన రివాల్వర్‌ వంటి ఆయుధాలు, లాగ్‌ రిజిస్టర్, పోలీసు వాహనాల కదలికల రిజిస్టర్‌ మొదలైన వాటిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) స్వాధీనం చేసుకుని హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలి. సిట్‌ ఇచ్చే వాటిపై నివేదికను, పోస్టుమార్టం నివేదికలను సుప్రీం కోర్టు నియమించిన జ్యుడీషియల్‌ కమిషన్‌కు ప్రభుత్వ అధికారులు అందజేయాలి’అని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శనివారం ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవాలు వెలుగులోకి రావాలి..
జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నిందితుడు మరణిస్తే.. సీఆర్పీసీలోని 176 (1)(ఎ) సెక్షన్‌ కింద జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ లేదా మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ మాత్రమే ఆ ఘటనపై విచారణ చేయాలని, అయితే చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆర్డీవో విచారణ చేపట్టినట్లు ప్రభుత్వ తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ సుప్రీం కోర్టులో చెప్పడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. 

‘వాస్తవాలు వెలుగులోకి రావాలి. ప్రజలకు నిజం ఏంటో తెలియాలి. అసలు ఏం జరిగిందో చట్టప్రకారం తేల్చాలి’అని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్‌కౌంటర్‌ ఘటనపై కలెక్షన్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ (ఆధారాల సేకరణ)పై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఈ నెల 17న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కె.సజన ఇతర మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాలు సంయుక్తంగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై శనివారం హైకోర్టు విచారణ జరిపింది. దిశ హత్యాచార ఘటనపై ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో ‘తక్షణ న్యాయం’పేరుతో నిందితులు మహమ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారని, సీబీఐ దర్యాప్తు చేసే ఉత్తర్వులు జారీ చేయాలని సజన, ఇదే మాదిరిగా మరో ఐదు పిల్స్‌ కూడా దాఖలయ్యాయి.

మృతదేహాలు సగం పాడయ్యాయి..
ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శ్రవణ్‌ కుమార్‌ స్వయంగా హాజరై ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రంగా ఉంచామని, ఇప్పటికే మృతదేహాల అంతర్గత భాగాలు 50 శాతం వరకు చెడిపోయాయని, మరో ఐదారు రోజులు ఉంచితే మృతదేహాల బయట కూడా చెడి పూర్తిగా పాడైపోతాయని చెప్పారు. మైనస్‌ 5 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చేందుకు దేశంలో ఎక్కడా వసతుల్లేవని తెలిపారు. 2 నుంచి 4 డిగ్రీల మధ్య మృతదేహాల్ని భద్రపరిచామన్నారు.

వద్దంటూనే ఒప్పుకున్న ప్రభుత్వం
ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ.. హైకోర్టు ఆదేశాల మేరకే నలుగురి మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి వైద్య నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించామని, కోర్టు ఆదేశాల మేరకే మృతదేహాల్ని భద్రపర్చామని, మళ్లీ పోస్టుమార్టం చేయాల్సిన అవసరం లేదన్నారు. రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయిస్తే రాష్ట్రంలో ఉన్న నిష్ణాతులైన ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులతో నిర్వహిస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉంటుందన్నారు. 

ఒకవేళ రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని ధర్మాసనం నిర్ణయిస్తే అందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఏజీ చెప్పారు. కోర్టుకు సహాయకారిగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాష్‌రెడ్డి వాదిస్తూ.. ఎన్‌కౌంటర్‌పై సందేహాలు, అనుమానాలు ఉన్నందున రాష్ట్రానికి సంబంధం లేని వైద్యులతో స్వతంత్రంగా రీపోస్టుమార్టం చేయిస్తే ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరుగుతుందని చెప్పారు.

ఎన్‌కౌంటర్‌ బోగస్‌..
పిటిషనర్‌ సజన తరఫు సుప్రీంకోర్టు న్యాయవాది వింద్రా గ్రోవర్‌ వాదిస్తూ.. ఇవి ప్రభుత్వ అధీనంలో జరిగిన హత్యలని అభివర్ణించారు. పిటిషనర్లు మహిళలు, బాలికల హక్కుల గురించి పోరాడుతున్నారని, హత్యాచార ఘటనలపై ఆందోళనలు చేస్తారని, అయితే దిశ హత్యాచార కేసులో నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడాలని కోరుకుంటున్నారని వివరించారు. తక్షణ న్యాయం పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకున్నప్పుడు మౌనంగా ఉంటే అరాచకాలకు తెర తీసినట్లవుతుందని పేర్కొన్నారు. 

ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఆధారాల సేకరణ, మృతదేహాల అప్పగింత అంశంపై హైకోర్టు ఉత్తర్వులివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, మృతదేహాలకు రెండోసారి పోస్టుమార్టం చేస్తేనే ఆధారాలు సేకరించినట్లు కాదని చెప్పారు. నిందితులు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండగా ఉన్నత స్థాయి శిక్షణ పొందిన పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారని, ఆ పోలీసులు అందరి దగ్గర ఆయుధాలు ఉంటే నిరాయుధులైన నిందితులు వాటిని లాక్కుని కాల్పులు జరపబోతే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశామని చెప్పడం కట్టు కథేనని వివరించారు. ఎన్‌కౌంటర్‌ జరిగాక సీనియర్‌ పోలీసులు, మంత్రులు సైతం ఘనకార్యం జరిగినట్లుగా స్పందించి వేడుకలు చేసుకున్నారని, తక్షణ న్యాయం పేరుతో పౌరహక్కుల్ని కాలరాశారని చెప్పారు.

ఏం జరిగిందంటే..
దిశ హత్యాచార ఘటన తొండుపల్లి టోల్‌గేట్‌ సమీపంలో నవంబర్‌ 27న జరిగింది. ఘటనా స్థలానికి ఈ నెల 6న నిందితుల్ని పోలీసులు తీసుకువెళ్తుండగా చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అదే రోజే సాయంత్రం పలు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు హైకోర్టుకు ఫిర్యాదు చేశాయి. దీనిని పిల్‌గా పరిగణించిన హైకోర్టు అదే రోజు రాత్రి న్యాయమూర్తి తన నివాసంలో ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమై విచారణ జరిపింది. 

అప్పటికే మృతదేహాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో గాంధీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు. ఇదే సమయంలో మృతదేహాల్ని భద్రంగా ఉంచాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత సుప్రీం కోర్టులో నేరుగా పిల్స్‌ దాఖలు కావడంతో ఎన్‌కౌంటర్‌ ఘటనపై జ్యుడీషియల్‌ కమిషన్‌ విచారణకు ఆదేశాలు వెలువడ్డాయి. హైకోర్టు సహా అన్ని రకాల విచారణలపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో మృతదేహాలు పాడవ్వకుండా మహబూబ్‌నగర్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement