సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు, కింది కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులను జూన్ 7 వరకూ పొడిగిస్తూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో గతంలోనే హైకోర్టు సహా కింది కోర్టులు జారీ చేసిన స్టే ఉత్తర్వులను ఈ నెల 20 వరకూ పొడిగించిన విదితమే. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆ తేదీ నుంచి మధ్యంతర స్టే ఉత్తర్వులను జూన్ 7 వరకూ పొడిగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. జూన్ 7లోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏమైనా ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈ స్టే ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. స్టే పొడిగింపు ఉత్తర్వుల కారణంగా ఎవరికైనా అన్యాయం జరిగిందని భావించినా, తీరని నష్టం వాటిల్లుతోందని అనుకున్నా వారు సంబంధిత కోర్టుల ద్వారా తగిన ఉత్తర్వులు పొందవచ్చని తెలిపింది. ఆస్తులకు సంబంధించి డిక్రీల అమలులో భాగంగా కోర్టు అధికారులు ఆస్తుల స్వాధీనం చేయకుండా అప్పీల్ చేసేందుకు ఆస్కారం లేనందున తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకూ డిక్రీల అమలును నిలిపివేస్తున్నట్లు హైకో ర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పీల్‌కు ఆస్కా రం లేనప్పుడు న్యాయాన్ని తోసిపుచ్చినట్లు అవుతుందని, అందుకే డిక్రీల అమలును నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment