సాక్షి, హైదరాబాద్ : పార్కులు, ఖాళీ స్థలాల్లో ఇప్పుడు ఆలయాన్ని కడుతుంటే అధికారులు అడ్డుకోకపోతే రేపు మసీదులు, చర్చిలు, గురుద్వార్ వంటివి కూడా అక్రమంగా నిర్మించేస్తారని హైకోర్టు హెచ్చరించింది. దేవుడి పేరుతో ఈ విధంగా ఆక్రమణలకు పాల్పడుతుంటే అధికారులు ప్రేక్షకపాత్ర పోషించడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. ఇంత ఉదాసీనంగా అధికారులు ఎందుకు ఉన్నారో ఫిబ్రవరి 26న జరిగే తదుపరి విచారణ సమయంలో తమకు స్వయంగా వివరించాలని పలువురు అధికారులను ఆదేశించింది. ఈమేరకు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌ఎండీఏ కమిష నర్, సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి, అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశిస్తూ సీజే జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ధర్మం దారి తప్పినప్పుడు దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడని, చట్టమే ప్రమాదంలో పడితే ఏం చేయాలని వ్యాఖ్యానించింది. అమీన్‌పూర్ గ్రామం లోని మాధవపురి హిల్స్‌లోని రాక్ గార్డెన్స్‌లో ఆలయాన్ని నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment