సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక‍్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో మంచిర్యాల జిల్లా టాపర్‌గా నిలిచిన ఓ విద్యార్థినికి ఈ ఏడాది ఫలితాల్లో చేదు అనుభవం ఎదురైంది. ఫస్టియర్ తెలుగులో 98 మార్కులు వచ్చిన ఆమెకు...ద్వితీయ సంవత్సరంలో సున్నా మార్కులు వచ్చాయి. ఫెయిల్ మెమో రావడంతో విద్యార్థినితో పాటు ఆమె తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా విద్యార్థిని తీవ్రంగా నష్టపోయినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన సత్తన్న, కవితల కూతురు నవ్య మండల కేంద్రంలోని కరిమల జూనియర్ కళాశాలలో ఇంటర్ సీఈసీ చదివింది. మొదటి సంవత్సరంలో 467 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ జిల్లా టాపర్‌గా రావాలని కష్టపడి చదివింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాలను చూసి అవాక్కయింది. మిగతా సబ్జెక్టులలో 90కి పైగా మార్కులు వచ్చి తెలుగులో సున్నా మార్కులు రావడంతో విద్యార్థిని నోట మాటరాలేదు. కళాశాల యాజమాన్యం సైతం ఆశ్చర్యపోయింది. నవ్య కళాశాల టాపర్ అని, తెలుగులో జీరో మార్కులు రావడం ఏంటని యాజమాన్యం అంటోంది. ఈ విషయాన్ని డీఐవో కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో నవ్యకు తెలుగు సబ్జెక్టులో 98 మార్కులు రాగా ద్వితీయ సంవత్సరంలో జీరో మార్కులు రావడం జీర్ణించుకోలేకపోతోంది.
తమకు న్యాయం చేయాలంటూ శనివారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అలాగే ఇంటర్ బోర్డు నిర్వాకంతో నష్టపోయిన విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తమ పిల్లల జీవితాలతో ఇంటర్ బోర్డు అధికారులు చెలగాటం ఆడుతున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ విద్యార్థులకు కూడా సున్నా మార్కులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవం లేని వారితో పరీక్ష పేపర్లు దిద్దించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో అక్కడకు వచ్చిన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను బాధితులు ఘోరావ్ చేశారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఇంటర్ బోర్డులో ఎలాంటి తప్పిదాలు జరగలేదని, అదంతా అభూతకల్పన అని ఆయన కొట్టిపారేశారు. అయితే రీ-వాల్యుయేషన్ అయినా సక్రమంగా జరిపించాలని వారు కోరారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment