అలా తెలంగాణకు న్యాయం జరగదు  | Telangana Judicial Commission has reported to the Supreme Court | Sakshi
Sakshi News home page

అలా తెలంగాణకు న్యాయం జరగదు 

Published Wed, Aug 29 2018 1:41 AM | Last Updated on Sun, Sep 2 2018 5:36 PM

Telangana Judicial Commission has reported to the Supreme Court - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: న్యాయాధికారుల విభజనకు సీనియారిటీని ప్రాతిపదికగా ఎంచుకుంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టుకు తెలంగాణ న్యాయాధికారుల సంఘం నివేదించింది. స్థానికత ఆధారంగానే విభజించాలని విజ్ఞప్తి చేసింది. న్యాయాధికారుల విభజనలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌ జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. మంగళవారం ఈ మేరకు తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సల్మాన్‌ ఖుర్షీద్, హుజేఫా అహ్మదీ తమ వాదనలు వినిపించారు. 

స్థానికత ఆధారంగానే విభజించండి 
సల్మాన్‌ ఖుర్షీద్‌ తన వాదనలు ప్రారంభిస్తూ ‘‘న్యాయాధికారుల పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తెలంగాణ నుంచి అతి తక్కువ మంది ఉన్నారు. ఏపీకి చెందిన సీనియర్‌ న్యాయాధికారులు తెలంగాణను ఎంచుకుంటే.. తెలంగాణ న్యాయాధికారులకు న్యాయం జరగదు. సామాజిక, ఆర్థిక అంశాల్లో తెలంగాణ అభివృద్ధి కోసమే ఈ విభజన అంటూ లక్ష్యాలు, కారణాలు శీర్షికన ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం పేర్కొంది. ఇదే విషయం సెక్షన్‌ 80లో కూడా ప్రతిబింబించింది. అందువల్ల సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా నేటివిటీ ఆధారంగా న్యాయాధికారుల విభజన జరపాలి.. లేదంటే తెలంగాణలో, ఏపీలో ఏపీ అధికారులే సీనియర్లుగా ఉండి పదోన్నతులు పొందుతారు’’అని నివేదించారు. మరో సీనియర్‌ న్యాయవాది హుజేఫా అహ్మది వాదిస్తూ ‘‘ఇతర శాఖల అధికారుల విభజన సందర్భంలో కూడా కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) ఇదే రకమైన మార్గదర్శకాలను ఖరారు చేసింది. అన్ని శాఖలు ఆయా మార్గదర్శకాలకు అనుగుణంగా విడిపోయినా.. న్యాయశాఖలో మాత్రం అలా అమలు చేయలేదు’’అని పేర్కొన్నారు. 

ఒకవేళ మిగిలిపోతే ఎలా? 
ఈ సమయంలో జస్టిస్‌ ఏకే సిక్రీ జోక్యం చేసుకుంటూ ‘‘తెలంగాణలో తెలంగాణ అధికారులు తక్కువగా ఉన్నారనుకుందాం. వారిని తెలంగాణకు కేటాయించారనుకుందాం. ఇంకా అక్కడ ఖాళీలు ఏర్పడి.. ఏపీలో మాత్రం ఏపీ అధికారులతో భర్తీ చేసినా అధికారులు మిగిలిపోతే వారిని ఎక్కడ కేటాయిస్తారు?’’అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హరిన్‌ రావల్‌ స్పందిస్తూ.. ‘‘రాష్ట్రం ఏర్పడింది ఇక్కడి వారిని స్థానికత ప్రాతిపదికన నియమించుకోవడానికి..’’అని వివరించబోయారు. దీనికి జస్టిస్‌ ఏకే సిక్రీ.. ‘‘నాకు సమస్య అర్థమైంది. వారిని ఇక్కడ ఎందుకు అనుమతించాలని మీరు చెప్పాలనుకుంటున్నారు’’అని అన్నారు. హరిన్‌ రావల్‌ స్పందిస్తూ ‘‘ఏపీ అధికారులు సీనియారిటీ ప్రాతిపదికన హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశాన్ని బట్టి ఏపీని ఎంచుకుంటారు. వారికంటే కొద్దిగా తక్కువ సీనియారిటీ ఉన్న వారు తెలంగాణను ఎంచుకుంటారు. తెలంగాణలో ఉన్నదే కొద్దిమంది కాబట్టి ఏపీ వారే సీనియర్లుగా ఉండి వారే ఇక్కడ పదోన్నతి పొందుతారు. అంతిమంగా తెలంగాణ వారు హైకోర్టు న్యాయమూర్తులు కాలేరు’’అని వివరించారు. 

వాళ్లను కాదనలేం కదా.. 
హరిన్‌ రావల్‌ వాదనపై జస్టిస్‌ సిక్రీ స్పందిస్తూ ‘‘నియామక పోటీలో వారు అధికారులుగా వచ్చి సీనియారిటీ పొందారు. వాళ్లను కాదనలేం కదా? నేటివిటీ ఆధారంగా అయితే ఇక్కడ తెలంగాణ వారిని ముందుగా కేటాయించి.. తదుపరి వారికంటే సీనియారిటీ ఉన్న ఏపీ అధికారులను జూనియర్లుగా నియమించాల్సి వస్తుంది కదా..’అని ప్రశ్నించారు. కానీ సీనియారిటీ ప్రాతిపదిక అయితే తెలంగాణలో తెలంగాణ అధికారులు ఎప్పటికీ జూనియర్లుగానే ఉంటారని హరిన్‌ రావల్‌ పేర్కొన్నారు. హుజేఫా అహ్మది వాదిస్తూ ‘‘పొరుగు రాష్ట్రానికి చెందిన అధికారులకే ఈ పోస్టులు వెళితే తెలంగాణ అధికారులు ఎన్నడూ హైకోర్టు న్యాయమూర్తులు కాలేరు. ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లాలంటే ఫీడర్‌ పోస్టు జిల్లా న్యాయమూర్తి పోస్టే..’’అని వివరించారు. ‘‘డీవోపీటీ ఇచ్చిన మార్గదర్శకాలను అన్ని శాఖలు అంగీకరించాయి. కానీ హైకోర్టు ఎందుకు అంగీకరించదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విభిన్న ప్రాంతాల ప్రజలకు 371డీ సమాన అవకాశాలను కల్పిస్తోంది. ఈ కేసులో దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి’’అని కోరారు. దీనికి ఏపీ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ.. 371డీ న్యాయ శాఖకు వర్తించదని నివేదించారు. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడొచ్చని వాదించారు. 

రెండు పట్టికలు సిద్ధం చేయండి 
ఇప్పటికే ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీనియారిటీ ప్రాతిపదికన అయితే ఏ రాష్ట్రానికి ఎంతమంది వెళ్తున్నారు? నేటివిటీ ఆధారంగా అయితే ఏ రాష్ట్రానికి ఎంత మంది వెళ్తున్నారు? అనే అంశాలపై రెండు పట్టికలను సిద్ధం చేయాలని హైకోర్టు రిజిస్ట్రీ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణికి ధర్మాసనం సూచించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉదయ కుమార్‌ సాగర్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ న్యాయ వాది వీవీఎస్‌ రావు, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మణిందర్‌సింగ్‌ హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement