హైకోర్టు విభజనకు చంద్రబాబు, సీజే అడ్డు
* ప్రత్యేక హైకోర్టుకై నినదించిన తెలంగాణ న్యాయవాదులు
* టీడీపీ నేత రమణకు పిండప్రదానం
* న్యాయవాదుల ర్యాలీ, అరెస్టు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును పోలీసుల రక్షణతో నడిపిస్తున్నారని తెలంగాణ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనను చంద్రబాబు, సీజే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. న్యాయశాఖలో నియామకాలను నిలిపివేయాలని, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ, తెలంగాణ హైకోర్టు సాధన కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో వందలాది మంది న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ కలసి న్యాయవ్యవస్థకు సంకెళ్లు వేశారంటూ న్యాయవాదులు సంకెళ్లతో నిరసన తెలిపారు.
చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణకు పిండప్రదానం జరిపించారు. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, కో కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి, హైకోర్టు సాధన కమిటీ చైర్మన్ సహోదర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎమర్జెన్సీలో సైతం పోలీసు రక్షణతో న్యాయవ్యవస్థ నిర్వహణ జరగలేదన్నారు. హైకోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ విధించడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజకీయాలు చేయాలనే ఆసక్తి ఉంటే తక్షణమే రాజీనామా చేసి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాలన్నారు. సమస్యలుంటే పరిష్కరించుకుందామంటున్న చంద్రబాబు హైకోర్టు విభజనపై చర్చకు రావాలన్నారు. అనంతరం చలో సెక్రటేరియట్‌కు ర్యాలీగా వెళ్తున్న తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం: ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టును విభజించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని.. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. హైకోర్టు విభజన, జూనియర్ సివిల్ జడ్జీల నియామక ప్రక్రియ నిలుపుదలపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు శ్రీరంగరావు, రాజేం దర్‌రెడ్డి, గోవర్దన్‌రెడ్డి సచివాలయంలో మంత్రిని కలిశారు. హైకోర్టు విభజన చేయకుండా న్యాయశాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తే తెలంగాణ వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. న్యాయవాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారన్నారు. స్పందిం చిన మంత్రి ఇది న్యాయవాదులదే కాదు.. తెలంగాణ సమస్య అని, ఇదే అంశంపై సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు.