సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూల్ టీచర్ల నియామకాల్లో రెండేళ్ల ప్రొబేషన్ విధానం అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రిన్సిపాల్ పోస్టుల్లో 30 శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేలా, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టుల్లో 50 శాతం పోస్టులను ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు (టీజీటీ) పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయాలని రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ టీచర్ల సర్వీసు రూల్స్‌లో పేర్కొంది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి శుక్రవారం సర్వీసు రూల్స్ ఉత్తర్వులు (జీవో 25) జారీ చేశారు.
2013లో మోడల్ స్కూల్స్ ప్రారంభమైనప్పటి నుంచి సర్వీసు రూల్స్ రూపొందించి అమల్లోకి తేవాలని టీచర్లు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం రూల్స్ జారీ అయ్యాయి. దీంతో మోడల్ స్కూళ్లలో బదిలీలకు, పదోన్నతులకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న 104 మంది ప్రిన్సిపాళ్లు, 1,989 మంది పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 764 మంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లతోపాటు (టీజీటీ) భవిష్యత్తులో నియమితులయ్యే వారికి ఈ రూల్స్ వర్తిస్తాయి. తెలంగాణ మోడల్ స్కూల్ ఎంప్లాయీస్ సర్వీసు రూల్స్ 2019గా పిలుస్తారు.
ఇవీ ప్రధాన నిబంధనలు..
► పాఠశాలలో పని భారాన్ని బట్టి ప్రిన్సిపాల్, ఇతర టీచర్ పోస్టులను సృష్టించడం, మార్పు చేయడం, రద్దు చేయడం వంటి అధికారాలు మోడల్ స్కూల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీకే ఉంటుంది.
► ఉపాధ్యాయుల జీత భత్యాలను నిర్ణయించే, సవరించే అధికారం కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీకే ఉంటుంది. అయితే ఇది ప్రభుత్వ ముందస్తు అనుమతితోనే చేయాలి.
► ప్రిన్సిపాల్ పోస్టుల్లో 30 శాతం పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారా, 70 శాతం పీజీటీలకు పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు.
► పాఠశాల విద్యా కమిషనర్ నియామకపు అధికారిగా ఉంటారు.
► పీజీటీ పోస్టుల్లో 50% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, మరో 50% పోస్టులను సంబంధిత సబ్జెక్టుతో అర్హత కలిగిన టీజీటీలకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు.
► ఇంగ్లిష్, తెలుగు, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, అర్థశాస్త్రం, పౌర శాస్త్రం, కామర్స్ సబ్జెక్టులు పీజీటీలో ఉంటా యి. వీటికి మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ నియామకపు అధికారిగా ఉంటారు.
► టీజీటీ పోస్టులు 100% డైరెక్టు రిక్రూట్‌మెంట్ ద్వారానే భర్తీ చేస్తారు. ఇందులో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు ఉంటాయి. మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ నియామకపు అధికారిగా ఉంటారు.
► ప్రిన్సిపాల్ పోస్టు కోసం పీజీటీలకు పదోన్నతి కల్పించేందుకు కేడర్ స్ట్రెంత్‌ను బట్టి 10 సబ్జెక్టుల పీజీటీలకు 13 పాయింట్ల రోస్టర్‌ను నిర్ణయించారు. ఇంగ్లిష్, తెలుగు, గణితం పోస్టులు 388 మిగతా సబ్జెక్టుల కంటే రెట్టింపు ఉండగా, మిగతా పోస్టులు 194 చొప్పున ఉన్నాయి. దీంతో 13 పాయింట్ల రోస్టర్‌ను నిర్ణయించారు. దీని ప్రకారం పదోన్నతులు కల్పించేటప్పుడు 1, 9వ పాయింట్‌లో ఇంగ్లిష్ వారికి, 2, 10వ పాయింట్‌లో గణితం వారికి, 3, 12వ పాయింట్‌లో తెలుగు సబ్జెక్టు వారికి పదోన్నతి కల్పిస్తారు. అలాగే 4వ పాయింట్‌లో బోటనీ వారికి, 5వ పాయింట్‌లో కెమిస్ట్రీ వారికి, 6వ పాయింట్‌లో సివిక్స్ వారికి, 7వ పాయింట్‌లో కామర్స్ వారికి, 8వ పాయింట్‌లో ఎకనామిక్స్ వారికి, 11వ పాయింట్‌లో ఫిజిక్స్ వారికి, 13వ పాయింట్‌లో జువాలజీ వారికి అవకాశం కల్పిస్తారు.
► సామాజిక, మహిళల రిజర్వేషన్లలో సాధారణ నిబంధనలే వర్తిస్తాయి.
► బదిలీలు, నియామకాల్లో ప్రిన్సిపాల్ పోస్టును రాష్ట్ర కేడర్‌గా, పీజీటీ, టీజీటీ పోస్టులను జోనల్ కేడర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు.
► పీజీటీ, టీజీటీ డైరెక్టు రిక్రూట్‌మెంట్‌లో రెండేళ్ల ప్రొబేషన్ విధానం ఉంటుంది. ప్రిన్సిపాల్ పదోన్నతులకు డీపీసీ నిర్వహిస్తారు. సెప్టెంబరు 1 నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్య కాలాన్ని ప్యానల్ సంవత్సరంగా పరిగణించి అర్హుల జాబితాను రూపొందిస్తారు.
► యాన్యువల్ పర్‌ఫార్మెన్స్ ఇండికేటర్స్‌కు వేరుగా మార్గదర్శకాలు జారీ చేస్తారు.
► ఉద్యోగ విరమణ, రాజీనామా, సెలవులు, కండక్ట్ రూల్స్ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment