నిరంకుశత్వం తలవంచిన వేళ | Telangana Movement Karimnagar Activists September 17th | Sakshi
Sakshi News home page

నిరంకుశత్వం తలవంచిన వేళ

Published Tue, Sep 17 2019 12:12 PM | Last Updated on Tue, Sep 17 2019 12:45 PM

Telangana Movement Karimnagar Activists September 17th - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కరడుగట్టిన నిజాం, వీర తెలంగాణ దిశను, దశను మార్చేందుకు సంకల్పించిన  ఉక్కు మనిషి సర్దార్‌ పటేల్‌ ముందు మోకరిల్లిన రోజు. వందల ఏళ్ల బానిసత్వపు సంకెళ్లనుంచి బాంచన్‌ కాల్మొక్త బతుకులకు స్వేచ్ఛ దొరికిన రోజు. దక్కన్‌ పీఠభూమిలోని ప్రజలందరూ సంబరాలు జరుపుకున్న రోజు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం దశాబ్దాలుగా సాగించిన పోరాటానికి ఫలితం లభించిన రోజు. స్వతంత్ర భారతంలో హైదరాబాద్‌ సంస్థానం కలిసిపోయిన రోజు. అదే సెప్టెంబర్‌ 17.

నాటి తెలంగాణ భౌగోళిక స్వరూపం
దేశంలోని అన్ని సంస్థానాల్లో కెల్లా హైదరాబాద్‌ ఎస్టేట్‌ పెద్దది. తెలుగు మాట్లాడే ప్రజలు సుమారు 90 లక్షలతో ఎనిమిది జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాల్లో 45లక్షల జనాభా, కర్నాటకలోని మూడు జిల్లాల్లో 20లక్షల జనాభాతో కలిపి 8 జిల్లాలు. కోటి 70 లక్షల జనాభా. 83 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విస్తరించింది. 

భూమి స్వరూపం..
సంస్థానంలో 60శాతం ప్రాంతాన్ని ఖాల్సా (నేరుగా నిజాం ఆధీనంలో ఉండేది. సారవంతమైన భూములన్నింటిని స్వంత ఆస్తిగా ప్రకటించుకున్నాడు. 30 శాతం గైర్‌ ఖాల్సా, దీన్ని జాగీర్లు, మఖ్తాలు, బంజరుదార్లు, ఈనాందార్లు, అగ్రహారాల పేర్లు పెట్టి దోపిడీ ప్రభువులకు అప్పగించారు. 10 శాతం సర్ఫేఖాస్‌ ప్రాంతం. ఇది పూర్తిగా నిజాం ప్రభువు జాగీర్‌. ఇపుడున్న హైదరాబాద్‌ (అత్రఫ్‌ అల్దా) మొత్తం నిజాం సొంత ఖర్చుల కోసం ఉద్దేశించింది. అప్పట్లోనే ఏటా రెండు కోట్లు ఆదాయం లభించేది. దీనికి తోడు ఖజానా నుంచి మరో 70 లక్షలు ఇస్తుండేవారు. 

ఆపరేషన్‌ పోలో..
దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే హైదరాబాద్‌ ఎస్టేట్‌లో రజాకార్ల దురాగతాలు కొనసాగుతున్నాయి. ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. విద్యార్థులు, రైతులు, నిజాంపై తిరగబడ్డారు. సంస్కృతి, సంప్రదాయాలు, వేషభాషల విధ్వంసంపై రజాకర్లపై ధిక్కార స్వరం వినిపించారు. తెలంగాణ పరిస్థితి చూసిన జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, మేజర్‌ జనరల్‌ జేఎన్‌ చౌదరి సారథ్యంలో ఆపరేషన్‌ పోలోకి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్‌ 13న భారత సైన్యం దక్కన్‌ పీఠభూమిని ఆక్రమించుకుంది. విజయవాడ నుంచి ఒకటి, బీదర్‌ దిశగా మరో దళం హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. మూడురోజులు ఎదురించే ప్రయత్నాలు చేసి చివరికి రజాకర్ల సైన్యం చేతులెత్తేసింది.


నిజాం వ్యతిరేక పోరాటంలో సామాన్యులు(ఫైల్‌) 

ఓటమి అంగీకరిస్తూ దిక్కుతోచని పరిస్థితిలో నిజాం 17వ తేదీన పటేల్‌ ముందు తల వంచాడు. బేగంపేట విమానాశ్రయంలో పటేల్‌కు స్వాగతం పలికి సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో చేర్చేందుకు అంగీకరించాడు. దీంతో భారత రిపబ్లిక్‌లో తెలంగాణ కలిసిపోయింది. ఆ క్షణం నుంచి జేఎన్‌ చౌదరి నేతృత్వంలో సైనిక గవర్నర్‌గా, ఎంకే వెల్గొడి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. నిజాం తన ప్రధాని లాయక్‌ అలీని పదవినుంచి తొలగించాడు. ప్రజలకు నరకయాతను చూపించిన ఖాసిం రజ్వీని అరెస్టు చేశారు. పూణె జైలుకు తరలించారు. అక్కడినుంచి విడుదలై పాకిస్తాన్‌కు వెళ్లాడు. 1948 నుంచి 1951 వరకు సాయుధ పోరాటం జరిగింది. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలతో తిరిగి ప్రజాస్వామ్యం అవతరించింది.

ఎదురుతిరిగిన ఎల్లప్ప
కోరుట్ల: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ పోలోను ప్రతిఘటించేందుకు ఖాసీం రజ్వీ దళాలు కొత్తగా సైనికులను నియమించే క్రమంలో 1947 ఆగస్టు నెలలోనే కోరుట్ల వాగుకు అవతల వైపు సంగెం గ్రామ శివారులో మకాం వేశాయి. ఒక్క రోజు గడిస్తే రజ్వీ దళాలు కోరుట్లలోకి చొరబడి ఆరాచకాలు పాల్పడే అవకాశాలున్నాయన్న సమాచారం అందుకున్న కస్తూరి ఎల్లప్ప ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చక్కని పథకం వేశారని ఆయన సహచరులు వేముల విశ్వనాథం చెప్పుకొచ్చారు. ఎల్లప్ప తన సహాచరులతో కలిసి సుమారు 20 మందిని పోగు చేసుకుని రాత్రి వేళ చీకట్లో కోరుట్ల వాగు సమీపంలో బొంగు కట్టెలకు నూలు బట్టలను చుట్టి నూనేలో ముంచి కాగడాలు చేతపట్టుకుని పెద్ద ఎత్తున భారత మాతాకు జై అన్న నినాదాలు చేస్తూ భారత సైన్యం కోరుట్లకు చేరుకుందన్న సమాచారం ఖాసీం రజ్వీ దళాలకు చేరేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో రజ్వీ దళాలు భయంతో అక్కడి నుంచి పరారైపోయినట్లు విశ్వనాథం తెలిపారు. 


కస్తూరి ఎల్లప్ప(ఫైల్‌), వేముల విశ్వనాథం 

బీడీ కార్మిక కుటుంబం
కోరుట్లకు చెందిన బీడీ కార్మిక కుటుంబంలో 1905లో కస్తూరి ఎల్లప్ప జన్మించారు. తల్లిదండ్రులు పుణేకు వలస వెళ్లడంతో యుక్త వయసు వరకు అక్కడే ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలకు ఆకర్షితులైన ఎల్లప్ప కోరుట్లలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలను నిర్వహించేవారు. 1947లో కోరుట్లలో భారత జాతీయ జెండాను ఆలయంపై ఎగురవేయడం..ఖాసీం రజ్వీ సేనలను బెదరగొట్టడం వంటి చర్యలు చేపట్టారు. ఎల్లప్ప 1991లో తుదిశ్వాస విడిచి చిరస్మరణీయుడిగా మిగిలారు. 

పెద్దపల్లిలో నిజాం ఏజెంట్ల పెద్దరికం..
పెద్దపల్లి: పెద్దపల్లి జాగీరి కింద ఆదిలాబాద్‌ జిల్లా నస్పూరు, తపాలాపూర్‌ ప్రాంతాలు విస్తరించి ఉండేవి. ఆయా ప్రాంతాలకు దేశ్‌ముఖ్‌లు పెద్దరికం చలాయిస్తూ పేదల నుంచి వసూలు చేసే పన్నులు నిజాంకు కట్టేవారు. నిజాం ఏజెంట్ల దౌర్జన్యాన్ని ఎదురించేందుకు పెద్దపల్లి ప్రాంతంలోని గట్టెపల్లి మురళీ నాయకత్వంలో సాదుల నంబయ్య, లొట్ల ముత్తయ్య, మద్దిరాల పురుషోత్తం తదితరులు పన్ను వసూలుకు వచ్చే నిజాం పోలీసులపై తిరుగుబాటు చేశారు. మంథనికి చెందిన గుల్లకోట శ్రీరాములు దళాన్ని ఏర్పాటు చేసి సిరివంచ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిపారు. 

నిజాయితీగా ఉద్యోగం చేస్తే బదిలీ.. 
కరీంనగర్‌ కలెక్టర్‌ కింద నా భర్త రాంచందర్‌రావు పేష్‌కార్‌గా పని చేశారు. ప్రజల నుంచి పన్నులు బలవంతంగా వసూలు చేయరాదని అన్నందుకు నాగపూర్‌ దగ్గరలోని షరీశ్రాపూర్‌కు బదిలీ చేశారు. అక్కడి నుంచి మళ్లీ మహబూబ్‌నగర్‌ అన్నసాగర్‌కు బదిలీ చేశారు. నిజాం పాలనలోని కలెక్టర్లు సైతం దుర్మార్గంగా వ్యవహరించేవారు. పోలీసుల ఆకృత్యాలైతే చెప్పతరం కాదు. నిజాం పోలీసులు గ్రామాలకు వస్తే గజగజ వణికిపోయే వాళ్లం.
 – లక్ష్మీకాంతమ్మ, 98 ఏళ్లు, పెద్దపల్లి 

చదువు పక్కనబెట్టి.. పోరాటబాట పట్టి..
మంథని: ‘అమ్మానాన్నకు ఒక్కగా నొక్క కుమారున్ని. మూడేళ్ల వయస్సులో అమ్మ చనిపోయింది. నాన్నే అన్ని తానై అల్లారుముద్దుగా పెంచాడు. పెద్దవాన్ని చేశారు. చదువు పక్కనబెట్టి నిజాంపై పోరాటం చేస్తుంటే ఓ రోజు నాన్న నన్ను కలిశాడు. ఉద్యమం వదిలిపెట్టు నీకు ఎన్ని డబ్బులైనా ఇస్తా. ఎక్కడికైనా వెళ్లు, జల్సాగా బతుకు అని బతిమిలాడాడు. ఓక్క కొడుకువి ఉద్యమంలో చనిపోతే నేను ఎట్లా బతకాలని వేడుకున్నాడు. కాని అప్పుడు నా మనస్సులో ఓకటే లక్ష్యం ఉండే. నేను ఉద్యమంలో చనిపోతే దేశంలోని ప్రతి ఓక్కరిని కన్నకొడుకులా భావించు అని అక్కడి నుంచి వెళ్లిపోయా. మా నాన్నను ఆ మాటలు ఎంతో బాధ పెట్టాయని తర్వాత తెలుసుకొని మదనపడ్డ’ అని సమరయోధుడు రాంపెల్లి కిష్టయ్య అన్నారు.


చాందా క్యాంపు శిక్షణలో స్వాతంత్య్ర సమరయోధులు(ఫైల్‌) 

ప్రస్తుతం ఆయనకు 92 ఏళ్లు. హైదరాబాద్‌లోని తన కూతురు ఇంట్లో ఉంటున్నారు. ఇండియన్‌ యూనియన్‌లో హైదరా బాద్‌ను చేర్చాలని సాగిన పోరాట పటిమ, సాధించిన విజ యాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. 1947లో భారతదేశంలోని 600 రాష్ట్రాలకు స్వాతంత్య్రం లభించినా హైదరా బాద్‌ను ఏడవ నిజాం ఉ స్మాన్‌ అలీఖాన్‌ బహుదుర్‌ వదిలి వె ళ్లకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయామని తెలిపారు. మధ్యప్రదేశ్‌ (ప్రస్తుత మహారాష్ట్ర)లోని చందాలో మంథనికి చెం దిన గులుకోట శ్రీరాములు ఆధ్వర్యంలో ఉద్యమ  శిక్షణ పొ ందినట్లు వెల్లడించారు. ఇండియన్‌ యూనియన్‌ ఆధ్వర్యం లో గెరిల్లా శిక్షణ పొంది పోలీస్‌స్టేషన్లు, నాకాలపై దాడులకు శ్రీకారం చుట్టామని, రోజుల తరబడి దట్టమైన అడవుల్లో తలదాచుకునే వాళ్లమని, ఎన్నో రోజులు అన్నం తినకుండా గడిపినట్లు వివరించారు. అయితే ఉద్యమం తీవ్రం కావడంతో ఇండియన్‌ యూనియన్‌ పోలీస్‌ యాక్షన్‌ను రంగంలోకి దింపడంతో స్వేచ్ఛ లభించినట్లు పేర్కొన్నారు.


రాంపెల్లి కిష్టయ్య

త్యాగధనుల పురిటి గడ్డ..
కరీంనగర్‌: ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసిన కరీంనగర్‌ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటంలోనూ కీలక భూమిక పోషించింది. జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరులో అమరులయ్యారు. 


సి.నారాయణరెడ్డి ,  కొండల్‌రావు, దేశిని చినమల్లయ్య, అనభేరి ప్రభాకర్‌రావు

రణభేరి మోగించిన ‘అనభేరి’
జమీందారి కుటుంబంలో పుట్టిన అనభేరి ప్రభాకర్‌రావు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి దళ నాయకుడిగా తుపాకి పట్టి పేదప్రజలకు బాసటగా నిలిచి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలను ఫణంగా పెట్టిన యోధుడు. రజకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేసి నిజాం గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. అతడిని పట్టుకోవడానికి ప్రత్యేక మిలటరీ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 1948 మార్చి 14న ప్రభాకర్‌ సాయుధ దళాన్ని హుస్నాబాద్‌ మండలం మహ్మదాపూర్‌ పోలీస్‌ పటేల్‌ భోజనానికి పిలిచి అ సమాచారాన్ని నిజాం ప్రభుత్వానికి తేలియజేశారు. దీంతో మహ్మదాపూర్‌ గు ట్టలను మిలటరీ, రజకార్లు చుట్టుముట్టి కాల్పులు జరి పారు. తూటాలకు ఎదురొడ్డి పోరాడి అనభేరితో పాటు సిం గిరెడ్డి భూపతిరెడ్డి, ముస్కు చొక్కారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, అ యిరెడ్డి భూంరెడ్డి, తూమేజు నారాయణ, బి.దామోదర్‌రెడ్డి, ఇల్లందుల పాపయ్య, పోరెడ్డి రాంరెడ్డి, నల్గొండ రాజరాం, చిక్కుడు సాయిలు, రోండ్ల మాధవరెడ్డి అమరులయ్యారు. 

కొరియర్‌గా చినమల్లయ్య.. 
తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్‌గా పాల్గొన్న దేశిని చినమల్లయ్య మలి విడత తెలంగాణ ఉద్యమంలో నూ క్రియాశీలంగా వ్యవహరించారు. 1948 ఫిబ్రవరిలో అ నభేరి ప్రభాకరరావును కలువగా ఆయన దళానికి కొరియర్‌గా పని చేయాలని చెప్పి కొన్ని గ్రామాల బాధ్యతలు ఇ చ్చారు. ఆయా గ్రామాల్లో తిరిగి వివరాలు సేకరించి, ద ళానికి చేరవేసేవారు. నాలుగు సార్లు సర్పంచ్‌గా, ఎమ్మెల్యే గా, ఒకసారి సమితి ప్రెసిడెంట్‌గా పదవులు చేపట్టారు.

విద్యార్థిగా దశలోనే..
విద్యార్థి దశలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు జువ్వాడి గౌతంరావు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని కరీంనగర్, వరంగల్‌ జైళ్లలో శిక్ష అనుభవించారు. 1947లో  ఔరంగాబాద్‌ జైల్‌ నుంచి తప్పించుకొని వచ్చి మళ్లీ ఉద్యమంలో పాల్గొన్నారు. బద్దం ఎల్లారెడ్డి లాంటి ఎందరో వీరుల మార్గదర్శకత్వంలో పనిచేశారు.

జువ్వాడి గౌతంరావు

ఉద్యోగానికి రాజీనామా చేసి..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్‌కు చెందిన బోజ్జపురి వెంకటయ్య స్వాతంత్య్ర ఉద్యమాలకు ఆకర్షితులై ఉద్యోగం వదిలి, పోల్సాని నర్సింగరావుతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో భాగంగా రాయికల్‌ పోలీసు స్టేషన్‌పై దాడి సంఘటనలో పాల్గొన్నారు. ముల్కనూర్‌ సర్పంచ్‌గా సేవలందించారు.

అక్షరాలే ఆయుధాలుగా..
వేములవాడ తాలూకా పరిధిలో హనుమాజీపేట గ్రామానికి చెందిన సి. నారాయణరెడ్డి చిన్న వయసులోనే ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం నిరంకుశ విధానాల వల్ల తప్పని సరై ఉర్దూ మాధ్యమంలో విద్యాభ్యాసం గావించారు. నిరంకుశ పాలన విధానాలకు, రజాకార్లు సాగించిన హింసాకాండలకు వ్యతిరేకంగా స్వయంగా జానపదగేయాలు రాసి, ఆలపించి, ప్రజా చైతన్యానికి సాహిత్యాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. 

కొరియర్‌గా కొండల్‌రావు.. 
వెలిచాల కొండల్‌రావు హైదరాబాద్‌లో చదువుకుంటూనే విద్యార్థి కార్యకర్తగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 15 ఏళ్ల వయసులో కోర్టు విచారణలో మెజిస్ట్రేట్‌కే ఎదురు తిరిగినందుకు 7 రోజుఏల జైలు శిక్ష గడపాల్సివచ్చింది. చంచల్‌గూడ జైలులో గడిపిన జీవితం తర్వాత హాస్టల్‌లో చదువుకుంటూ కాంగ్రెస్‌ పార్టీలో సోషలిస్టు వర్గానికి మద్దతునిచ్చేవారు. నాయకులకు కోరియర్‌గా పని చేశారు.

పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన ధీశాలి..
మహదేవ్‌పూర్‌కు చెందిన ఎస్‌.శంకరయ్య భద్రాచలంలో ప్రైవేట్‌ గుమాస్తాగా పని చేస్తూ 1947లో ఉద్యమానికి ఆకర్షితుడయ్యారు. ఖమ్మం నుంచి వచ్చిన  వెంకటేశ్వర్‌రావుతో కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అప్పట్లో ఎస్‌ఐ గురుదయాళ్‌సింగ్‌ వీరిని అరెస్ట్‌ చేశారు. మంథని వీధుల్లో లాఠీ దెబ్బలు కొడుతూ ఊరేగించారు. అనంతరం తప్పించుకుని చాందా క్యాంపులో చేరిపోయారు. ఆపైన మహదేవ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌గా భావించి కాళేశ్వరం ఔట్‌పోస్ట్‌పై దాడి చేశారు.

పోరాటాల గడ్డ.. సిరిసిల్ల
సిరిసిల్ల: తెలంగాణ విముక్తి ఉద్యమం చురుగ్గా సాగుతున్న దశలో 1935 డిసెంబర్‌లో సిరిసిల్లలో నాల్గో ఆంధ్ర మహాసభ మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో తీసుకున్న కీలక నిర్ణయాలతో విముక్తి పోరాటం ఉవ్వెత్తున ఎగి సింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, అమృత్‌లాల్‌శుక్లా, చెన్నమనేని రాజేశ్వర్‌రావు, దామోదర్‌రావు, తిరుపతిరెడ్డి, భూపతిరెడ్డి, రాజారాం లాంటి ఎందరో యోధులు అజ్ఞాతవాసంతో చారిత్రాత్మక పోరాటాన్ని సాగించారు. సిరిసిల్లలో జరిగిన ఆంధ్రామహాసభలో సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, పి.వి.నర్సింహరావు, బద్దం ఎల్లారెడ్డి, కె.వి.రంగారెడ్డి లాంటి వారితో జిల్లాలోని పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ విముక్తి ఉద్యమంలో ప్రధానంగా ముందున్నారు. గెరిల్లా దళాలకు మానాల క్యాంపులో శిక్షణ ఇస్తూ.. పోరాటానికి బాటలు వేశారు. రుద్రంగి శివారులోని మానాల శిక్షణ శిబిరం సాయుధ పోరాటానికి ఊపిరి పోసింది. ఇక్కడ శిక్షణ పొందిన తెలంగాణ యోధులు రజాకార్లను ఉరికించారు. త్రివర్ణపతాకం ఎగురవేయడమే నేరమైనట్లుగా ఖాసీంరజ్వీ రెచ్చిపోతే.. ఆయన ప్రైవేటు సైన్యమైన రజాకార్ల అకృత్యాపై పేదోళ్లు తిరుగుబాటు చేశారు.


బద్దం ఎల్లారెడ్డి(ఫైల్‌), అమృత్‌లాల్‌ శుక్లా (ఫైల్‌), రాజేశ్వరరావు(ఫైల్‌) 

సాయుధపోరుకు శ్రీకారం..
1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీసు క్యాంపుపై సాయుధ ఉద్యమకారులు దాడి చేసి ఎస్సైతో సహా ఆరుగురు పోలీసులను హతమార్చారు. ఈ ఘటనలో అప్పటి సాయుధ దళనేత అనభేరి ప్రభాకర్‌రావు దళం పాల్గొంది. ఈ దాడితో గెరిల్లా తరహాదాడులకు తెలంగాణ ఉద్యమకారులు తెగించి తెగువను చాటుకున్నారు. మరసటి రోజే అప్పటి ఉద్యమనేత అనభేరి ప్రభాకర్‌రావు దళం 1948 మార్చి 14న హుస్నాబాద్‌ మండలం మహ్మదాపురం గుట్టల వద్ద ఆశ్రయం పొందగా.. పోలీసులు దాడి చేశారు. పరస్పరం కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. దీంతో విచక్షణ కోల్పోయిన పోలీసులు అనభేరి ప్రభాకర్‌రావుతో సహా.. సిరిసిల్ల మండలం లక్ష్మీపూర్‌కు చెం దిన సింగిరెడ్డి భూపతిరెడ్డి, దామోదర్‌రెడ్డి, నారాయణ, భూం రెడ్డి, పాపయ్య, మల్లారెడ్డిలను కాల్చి చంపారు. ఈ ఘటన తెలంగాణ సాయుధ పోరాటంలో రక్తచరిత్రగా మిగిలింది. 

అమృత్‌లాల్‌...
నిజాంను ఎదిరించిన వారిలో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అమృత్‌లాల్‌ శుక్లా ప్రముఖుడు. 1950లో సిరిసిల్ల పోలీస్‌స్టేష న్‌పై దాడి చేసి సంచలనం సృష్టించిన వీరుడు. శుక్లాను నిజాం పోలీసులు నిర్బంధించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. చంచల్‌గూడ జైలు నుంచి తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తప్పించుకున్నాడు. 1957లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 85 ఏళ్ల వయస్సులో 1991 నవంబర్‌ 14న అమృత్‌లాల్‌ శుక్లా అస్తమించారు. 

త్యాగాల గాలిపెల్లి..
ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి చెందిన కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఇది జీర్ణించుకోలేని నిజాం పోలీసులు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతూ నిర్బంధాన్ని అమలు చేశారు. నాటి రజాకార్లకు వ్యతిరేకంగా కొడవళ్లు, గొడ్డళ్లు, బరిసెలు, గుల్లెర్లతో పోరుసాగించారు. ఈ పోరులో గాలిపల్లితో పాటు సమీప గ్రామాలకు చెందిన పదకొండు మంది ఒకే రోజు అమరులయ్యారు. ఉద్యమంతో సంబంధం లేని గాలిపెల్లికి చెందిన పెరంబుదూరి అనంతయ్య, రంగమ్మ వృద్ధ దంపతులు బలయ్యారు. గ్రామ సమీపంలోని మొక్కజొన్న చేనులో తలదాచుకున్న వీరిని రజాకార్లు వృద్ధులనికూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపారు. 

రజాకార్ల కళ్లు గప్పి.. తప్పించుకుని.. 
గాలిపెల్లిలో రజాకారర్ల దాడిలో బద్దం ఎల్లారెడ్డి, రాజ లింగం, అమృత్‌లాల్‌ శుక్లా చాకచక్యంగా తప్పించుకున్నారు. ఆగ్రహం తో రజాకార్లు గాలిపెల్లి ఊరును తగులబెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఉద్యమకారులు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి తుపాకుల్ని అపహరించారు. ఆయుధాల సేకరణకు అప్పట్లోనే ఠాణాను లక్ష్యంగా చేసుకున్నారు. సాయుధ పోరాటానికి గాలిపెల్లి ఊపిరి పోసింది. ప్రతి దాడులకు వేదికైంది.

సాయుధ యోధుడు ‘చెన్నమనేని’
సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న వారిలో సిరిసిల్ల మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వర్‌రావు ముఖ్యులు. వి ద్యార్థి దశలో తొలిపోరాటం సాగించారు. దున్నేవాడికే భూమి కావాలని నినదించారు. చిరోంచ ప్రాంతంలో సాయుధ ద ళాలకు రాజేశ్వర్‌రావు శిక్షణ ఇచ్చారు. అక్కడే మాజీ ప్రధాని పీ. వి. నర్సింహారావుతో చెన్నమనేనికి పరిచయం ఏర్పడింది.  హై దరాబాద్‌లో అరెస్టయి 12 నెలల పాటు కరీంనగర్, వరంగల్, చంచల్‌గూడ, గుల్బర్గా జైళ్లలో గడిపారు. 1948 సెప్టెంబర్‌ 17 తర్వాత సాయుధ పోరాటం వద్దని రాజేశ్వర్‌రావు చెప్పారు. దీంతో కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయాయి. తొలిసారి చొప్పదండి ఎమ్మెల్యేగా 1957లో ఎన్నికయ్యారు. తరువాత సిరిసిల్ల ఎమ్మెల్యేగా 1967, 1978, 1985, 1994, 2004లో ఎన్నికయ్యారు. 2016 మే 9న 93 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. రాజేశ్వర్‌రావు తన రాజకీయ, సాయుధ పోరాటంపై ‘సత్యశోధన’ ఆత్మకథ పుస్తకాన్ని రాశారు.

చెన్నమనేని రాజేశ్వర్‌రావు

16వ ఏటనే ఉద్యమాల్లోకి..
వేములవాడ: ఉద్యమమే ఊపిరిగా 96 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఉన్న నమిలకొండ పుల్లయ్య అలియాస్‌ గుమ్మి పుల్లన్న వేములవాడ వాసి. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలోనైనా.. భూపోరాటమే పంథాగా ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 16వ ఏట కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. నేటికీ వేదాలు, మంత్రాలు పటిస్తూనే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడం ఆయనకే సొంతం. ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న పుల్లన్నకు నేటికీ స్వాతంత్య్ర సమరయోధుడి పెన్షన్‌ మంజూరు కాకపోవడం బాధాకరం. స్వాతంత్య్ర సమరయోధుడు రాజేశ్వర్‌రావుకు వెన్నంటి ఉంటూ భూపోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ దున్నేవాడికే భూమి అనే నినాదంతో రైతులను జాగృత పరుస్తూ ఊరూరా ఉద్యమాలను కొనసాగించారు.


గుమ్మి పుల్లన్న

సిరిసిల్ల ఠాణాపై దాడులు..
రైతు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి నిర్వహించి 9 తుపాకులు ఎత్తుకెళ్లారు. అలాగే తిమ్మాపూర్‌ మిలటరీ క్యాంపుపై నాలుగువేల మంది రైతులతో కలసి దాడి చేసి 110 తుపాకులను ఎత్తుకెళ్లారు. తుపాకులు ఎత్తుకెళ్లడంతో పుల్లన్నను పోలీసులు గుర్తించే అవకాశం ఉన్నందున పార్టీ తీర్మానం మేరకు అతడిని మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు బదిలీ చేశారు. దీంతో వారంపాటు కాలినడకన చంద్రపూర్‌కు చేరుకున్నారు. మూడేళ్లు అక్కడే కోయ, గోండు, నేతకాని, గుత్తికోయల వారితో పార్టీ పునర్నిర్మాణం చేశారు. మూడేళ్ల అనంతరం చంద్రపూర్‌ కమిటీ ఇద్దరు కొరియర్ల సాయంతో పుల్లన్నను కరీంనగర్‌కు పంపించింది. ఈక్రమంలో ధర్మపురి గంగ వద్ద స్నానాలు చేస్తున్న వీరిపై పోలీసులు దాడులు చేశారు. ఇరువురు కొరియర్లను చంపేసి అక్కడే గడ్డిలో తగులబెట్టారు. పుల్లన్నను అరెస్టు చేసి గుల్బర్గా జైలుకు తరలించగా, మూడేళ్లు గడిపాడు. చివరకు ఎలాగోలా బయటిపడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పుల్లన్న చురుకుగా పాల్గొన్నారు. పోరాటయోధుడిగా పేరొందిన పుల్లన్నను ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇక్కడి ప్రజాప్రతినిధులు పౌరసన్మానం చేస్తారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement