సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో కీలక నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరం అశోక్ కోసం సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తమ డేటా కూడా చోరీ చేశారని ఆధార్ సంస్థ కూడా తాజాగా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ వేగవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ‘సేవా మిత్ర’యాప్ కోసం దాన్ని నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆధార్ సర్వర్ నుంచే సమాచారాన్ని తస్కరించి ఉంటుందన్న అనుమానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆధార్ సమాచారం కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉందని సిట్ బృందం గుర్తించింది.
అశోక్ కోసం ప్రత్యేక బృందాలు..
గత ఫిబ్రవరి 27 తరువాత అశోక్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అప్పుడే ఏపీకి పారిపోయిన అతను అక్కడ ఏపీ పెద్దల సంరక్షణలో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విచారణకు రావాలని పోలీసులు మూడుసార్లు నోటీసులు జారీ చేయడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో సిట్ కొన్ని ప్రత్యేక బృందాలను ఏపీకి, కర్ణాటకకు పంపింది. ఐటీ గ్రిడ్స్ సంస్థలపై దాడులు చేసినప్పుడు పోలీసులు దాదాపు 60 హార్డ్ డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వాటిలో సమాచారం డిలీట్ చేసి ఉంది. దాదాపు 40 హార్డ్ డిస్క్‌ల నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) సమాచారాన్ని రీట్రైవ్ చేయగలిగింది. తెలంగాణ, ఏపీ ప్రజల ఆధార్ వివరాలు తీసుకున్నట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు తేల్చడంతో మిగిలిన డిస్క్‌ల్లో ఏముందోనన్న ఉత్కంఠ నెలకొంది. వాటిలో కీలక అంశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆపరేషన్ అశోక్ ముమ్మరం
Published Fri, Apr 19 2019 1:43 AM | Last Updated on Fri, Apr 19 2019 9:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment