
'పట్టిసీమతో తెలంగాణకూ ఇబ్బందే'
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్ట్తో తెలంగాణకు కూడా ఇబ్బందేనని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాస్తవాన్ని పసిగట్టి పట్టిసీమ నిర్మాణానికి అభ్యంతరం చెప్పాలని సీఎం కేసీఆర్కు పాల్వాయి సూచించారు. మంగళవారం హైదరాబాద్లో పాల్వాయి గోవర్థన్రెడ్డి మాట్లాడుతూ... పట్టిసీమతో పోలవరం ప్రాజెక్ట్ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గోదావరి జలాలు వినియోగించుకోవడంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలన్నారు.
పాలమూరు ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా రాదని సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ తేల్చిందన్న విషయాన్ని ఈ సందర్బంగా పాల్వాయి గుర్తు చేశారు. ఇచ్చంపల్లిని కలుపుకుని 7 బ్యారేజీలతో ప్రాణహిత - చేవెళ్ల చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేలకుండా ప్రాజెక్ట్లను రూపొందిస్తే తెలంగాణ రాష్ట్రమే నష్టపోతుందని పాల్వాయి అన్నారు.