నాలుగు తరాల కెరటం
సాక్షి, నల్లగొండ: పాల్వాయి గోవర్దన్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఫక్తు కాంగ్రెస్ వాదిగా, గాంధీ కుటుం బానికి వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన.. రాజకీయ ప్రస్థా నం ఐదున్నర దశాబ్దాల పాటు సాగింది. 1967లో మునుగోడు ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన ఆయన ఐదుసార్లు ఎమ్మె ల్యేగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రి గా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యు డిగా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్‌గా పలు హోదాల్లో పనిచేశారు.
ఆయన కాంగ్రెస్ పార్టీలో నాలుగు తరాల నాయకుడు. భారత తొలి ప్రధాని నెహ్రూ నాయకత్వంలో యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. తర్వాత ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ నాయకత్వంలోనూ రాజకీయాల్లో ఉన్నారు. ముక్కుసూటి మనిషిగా పేరుపొందారు. తెలంగాణ విషయంలోనూ, పార్టీలో అంతర్గత విషయాల్లో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేవారు
విద్యార్థి దశ నుంచే..
పాల్వాయి విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఉస్మాని యా వర్సిటీ ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగానూ పనిచేశారు. యూత్ కాంగ్రెస్‌కు 1961–63 మధ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1963–67 మధ్య రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కమ్యూనిస్టుల కంచుకోట మునుగోడులో ఆయన గెలుపు అప్పట్లో సంచలనం కలిగించింది.
తర్వాత వరుసగా 1972, 1978, 1982లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి తదితర నేతలతో కలసి అరెస్టయ్యారు. నెలరోజులు జైలు జీవితం గడిపారు. 1978–80లో సీఎల్పీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1979–81 మధ్య రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. 1981లో భవనం వెంకట్రామిరెడ్డి కేబినెట్‌లో గ్రామీణ నీటి సరఫరా, యువజన సర్వీసుల మంత్రిగా పనిచేశారు.
1981–82 మధ్య కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్‌లో చేనేత, జౌళి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1984లో ఎన్నికల్లో ఆరోగ్య కారణాల రీత్యా పోటీ చేయలేదు. 1989లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 1994లో కాంగ్రెస్ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో రెబెల్‌గా పోటీచేసి.. ఓటమి పాలయ్యారు. రెండేళ్ల అనంతరం తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1999లో కాంగ్రెస్ తరఫున మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2007–09 మధ్య ఎమ్మెల్సీగా పనిచేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
విలువల కోసం తపించిన వ్యక్తి..
పాల్వాయి ఆకస్మిక మృతి పట్ల మాజీ గవర్నర్ కె.రోశయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి జీవితాంతం కాంగ్రెస్ పార్టీ విలువల కోసం తపించిన వ్యక్తి అని, ఆయన లేని లోటు తీరనిదని వ్యాఖ్యానించారు.