సాక్షి, హైదరాబాద్: ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. సమ్మె వ్యవహారాన్ని కార్మిక న్యాయస్థానమే తేల్చాలని, దీనికి రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ హైకోర్టు కార్మిక శాఖ కమిషనర్‌కు సూచించిన నేపథ్యంలో... ఈ వ్యవహారం ఇప్పుడు కార్మిక శాఖకు చేరింది. దీంతో కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని జేఏసీ బుధవారం వెల్లడించింది. విషయం కార్మిక న్యాయస్థానం పరిధిలోకి వెళ్లే అవకాశం ఉన్నందున... ప్రజలు, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే, సమ్మెలో ఉన్న కార్మికుల ఆత్మగౌరవం కాపాడాలని, సమ్మెకు పూర్వం ఉన్న పరిస్థితి కల్పించి వారిని విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి సానుకూలత వ్యక్తమైతే సమ్మె విరమిస్తామని పేర్కొంది. లేని పక్షంలో యథాతథంగా సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.
సమ్మె విషయంలో హైకోర్టులో ఊరట లభిస్తుందని ముందు నుంచి ఊహించిన కార్మికులకు.. అనుకూల నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవటంతో సమ్మె కొనసాగించే విషయంలో పునరాలోచనలో పడ్డారు. విషయం కార్మిక శాఖ పరిధిలోకి వెళ్లటం, అక్కడి నుంచి కార్మిక న్యాయస్థానానికి వెళ్లేందుకు కనీసం రెండు వారాల సమయం పట్టడం, ఆ తర్వాత తీర్పు రావటానికి మరికొంత సమయం పడుతుండటంతో సమ్మె విరమించాలంటూ జేఏసీపై ఒత్తిడి వచ్చింది. అదే సమయంలో సమ్మెను మరింత ఉధృతం చేయాలన్న ఒత్తిడి కూడా ప్రారంభమైంది. దీంతో మెజార్టీ కార్మికుల అభిప్రాయానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో మంగళవారం డిపోల స్థాయి నేతలతో జేఏసీలోని నాలుగు సంఘాలు విడివిడిగా సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే.
ఇందులో సమ్మె విరమించాలనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమైనా, దానికి భిన్నమైన వాదన కూడా వచ్చింది. ఆ తర్వాత జేఏసీ భేటీ అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. కార్మిక శాఖ ఎలా వ్యవహరించే అవకాశం ఉంది.. కార్మిక న్యాయస్థానానికి కేసు బదిలీ అయితే ఏం జరిగే అవకాశం ఉంది... తదితరాలపై న్యాయవాదుల సలహా తీసుకున్నాక తుది నిర్ణయం వెల్లడించాలని నిర్ణయించింది. హైకోర్టు పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి ప్రతి ఆధారంగా బుధవారం న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించి చివరకు సమ్మె విరమణకే మొగ్గు చూపింది. ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో వివరాలను జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. కో–కన్వీనర్లు రాజిరెడ్డి, సుధ, లింగమూర్తి, థామస్‌రెడ్డితోపాటు తిరుపతి, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు.
సానుకూల స్పందన వస్తుందా?..
సమ్మె విరమించాక కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే పరిస్థితి గందరగోళంగా మారే ప్రమాదం ఉన్నందున ముందుగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాల్సి ఉంటుందని నిర్ణయించి, కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను జేఏసీ ప్రభుత్వం ముందుంచింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే తమ ప్రధాన డిమాండ్ అంటూ పేర్కొన్నా, దాన్ని తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు 10 రోజుల క్రితమే ప్రకటించి ఓ మెట్టు దిగింది. ఇప్పుడు... 47 రోజుల పాటు ఉధృతంగా నిర్వహించిన సమ్మెనే విరమించుకునేందుకు సిద్ధమని పేర్కొంది. దీంతో మెట్టు దిగకుండా భీష్మించుకుని కూర్చున్న ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం అందరి దృష్టి నిలిచింది.
సమ్మె ప్రారంభమయ్యాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దాదాపు డజన్ పర్యాయాలు అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కోర్టులో వ్యవహరించాల్సిన తీరు, ఆర్టీసీ ప్రైవేటీకరణ, ప్రైవేటు బస్సులకు పర్మిట్ల కేటాయింపు... తదితర అంశాలపై చర్చించారు. ఈ నిర్ణయాల ప్రకారమే ఆర్టీసీ, రవాణాశాఖ నడుచుకుంది. ఇప్పుడు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో కూడా ఆర్టీసీ సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. సీఎం స్థాయిలోనే దీనిపై నిర్ణయం జరగాల్సి ఉంది. దీంతో ఆయన దీనిపై ఎప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారోనని 49,500 మంది కార్మికుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
రెండు రోజులుగా డిపోలకు ‘ఆదేశం’..
హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారమే సమ్మె విరమణపై కొందరు కార్మికులు ఆసక్తి చూపుతున్నారన్న మాట వినిపించింది. కార్మికులు వస్తే ఏం చెప్పాలంటూ చాలా చోట్ల డిపో మేనేజర్లు ఉన్నతాధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో నేరుగా డిపోలకు వచ్చే కార్మికుల నుంచి ఎలాంటి లేఖలు తీసుకోవద్దని, విధుల్లో చేరే విషయంలో వారితో అసలు మాట్లాడొద్దంటూ అన్ని డిపోలకు మౌఖిక ఆదేశాలందినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఫోన్లు చేసి మరీ హెచ్చరించారు. బుధవారం కూడా ఉన్నతాధికారులు మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
డ్యూటీ చార్టు, హాజరు పట్టికలో తప్ప ఎక్కడా సంతకం చేయం...
ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి బుధవారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్ విభాగం ప్రతినిధులు, కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం విద్యానగర్‌లోని టీఎంయూ కార్యాలయానికి తరలివెళ్లారు. సాయంత్రం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కార్మిక న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు ఉంది. హైకోర్టు సూచనలను రెండు పక్షాలు గౌరవించాలి. కోర్టు చెప్పినట్లుగా వెంటనే విషయాన్ని లేబర్‌కోర్టుకు రిఫర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలపై కూడా ఆ కోర్టులో ప్రస్తావిస్తాం. ఇప్పుడు సమ్మెలో ఉన్న కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి ఆహ్వానించాలి.
ఇందులో ఎలాంటి షరతులు విధించొద్దు. కార్మికులు డ్యూటీ చార్టు, హాజరు పట్టికలపై తప్ప ఎలాంటి షరతుల ప్రతులపై సంతకాలు చేయరు. కార్మికుల ఆత్మగౌరవం నిలిచేలా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అక్టోబర్ 4న (సమ్మెకు పూర్వం) ఉన్న పరిస్థితులను కల్పించాలి. కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం స్పందించలేదు, ముందుగా మేమే స్పందించి సమ్మె విరమణ అంశాన్ని పేర్కొంటున్నాం. మా సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధం. లేని పక్షంలో సమ్మె కొనసాగిస్తాం.’’
Comments
Please login to add a commentAdd a comment