‘కర్నూలు’ ఇసుకకు చెక్! | Telangana sand demand | Sakshi
Sakshi News home page

‘కర్నూలు’ ఇసుకకు చెక్!

Jul 2 2015 1:22 AM | Updated on Aug 14 2018 3:37 PM

కర్నూలు ఇసుక పేరుతో తెలంగాణలో అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

 రాష్ట్రంలోకి పర్మిట్లు లేకుండా
 తరలింపుపై చర్యలు
 లారీ యజమానుల డిమాండ్‌కు ప్రభుత్వ సానుకూల స్పందన
 తెలంగాణ ఇసుకకు డిమాండ్
 పెరగటంతోపాటు ధర తగ్గే వీలు!
 చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు
 
 సాక్షి, హైదరాబాద్: కర్నూలు ఇసుక పేరుతో తెలంగాణలో అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పర్మిట్లు, లోడ్ పరిమాణంతో సంబంధం లేకుండా యథేచ్చగా తరలిస్తున్న ఆ ఇసుక వల్ల తెలంగాణలోని ఇసుకకు డిమాండ్ తగ్గుతోందని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రోడ్లు, భవనాలు, రవాణా, కార్మిక, గనులు, పురపాలక శాఖల ఉన్నతాధికారులు, లారీ యజమానుల సంఘం నేతలు హాజరయ్యారు. సంఘం గౌరవాధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, దుర్గాప్రసాద్ లారీ యజమానుల సమస్యలను అధికారుల ముందు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా కర్నూలు ఇసుక పేరుతో జరుగుతున్న దందా, వినియోగదారులు నష్టపోతున్న తీరును వివరించారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
 
 వినియోగదారులపై భారం
 తెలంగాణ ప్రాంతంలోని ఇసుకకు టన్ను ధర రూ.1200 పలుకుతుండగా, కర్నూలు పేరుతో అమ్ముతున్న ఇసుక ధర రూ.1,800 పలుకుతోంది. దీంతో చాలామంది వ్యాపారులు కర్నూలు ఇసుక పేరుతో స్థానిక ఇసుక ధర పెంచి వినియోగదారులపై భారం మోపుతున్నారు. కర్నూలు నుంచి ఇసుక తెలంగాణలోకి రాకుండా చూడటం వల్ల స్థానిక ఇసుకకు డిమాండ్ పెరగటంతో ఇక్కడి లారీ యజమానులకు ఉపయోగం కలుగుతుందని, ధర తగ్గి వినియోగదారులకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు అందుకు తీసుకోవాల్సిన చర్యలను త్వరలో ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. లారీ యజమానుల నుంచి ఇకపై ఎవరైనా తైబజారు రుసుము వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చూస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వారంరోజుల్లో కొత్తగా నాలుగు రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు అంగీకరించారు. అలాగే ఇసుక ఫిల్టర్లు లేకుండా చూస్తామని, చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం ద్వారా ఓవర్‌లోడింగ్ సమస్యను అధిగమిస్తామని అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement