స్పీకర్‌నైనా.. మీ మిత్రుడినే
►స్పీకర్‌గా నా మొదటి జీతం కళాశాలకు ఇస్తా
►పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో శాసనసభాపతి
► సిరికొండ మధుసూదనాచారి
పరకాల : తాను స్పీకర్‌నైనా మీ మిత్రుడినేనంటూ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. పట్టణంలోని ఎంఎన్‌రావు గార్డెన్‌లో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆహ్వాన కమిటీ కన్వీనర్ ఎర్ర సంపత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జన్మనిచ్చిన గడ్డకు, ఈ గాలికి, తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, రాజకీయంగా జన్మనిచ్చిన ఎన్టీ రామారావుకు వందనాలు
తెలుపుతున్నానన్నారు. 14ఏళ్లుగా తన సహచరుడిగా భావించి కన్నీళ్లను, కష్టాలను పంచుకుని అత్యున్నత పదవి అప్పగించిన కేసీఆర్‌కు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
సమైక్యవాద విధానాల వల్లే..
సమైక్యవాద పాలకుల విధానాలతోనే తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని స్పీకర్ అన్నారు. 800 ఏళ్ల క్రితమే కాకతీయులు, రెడ్డి రాజులు ఇక్కడ రామప్ప, లక్నవరం, ఎల్గూరు రంగంపేట, ధర్మసాగర్ వంటి ప్రాజెక్టులు నిర్మించారన్నారు. సమైక్య పాలకులు ఆర్డీస్ ప్రాజెక్టు నీటిని తరలించుకుపోయి పాల మూరు ప్రజలను కూలీలుగా మార్చారని విమర్శించారు. కసి, పట్టుదలతో వచ్చిన ఉద్యమమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందన్నారు. ఒకానొక సందర్భంలో ఉద్యమ పార్టీని మింగేసే కుట్ర జరిగినా ఆత్మవిశ్వాసంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి ముందే ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులపై పూర్తి స్థాయిలో విశ్లేషించడం వల్లే ఇంతటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రపంచ విత్తన కర్మాగారంగా వర్థిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మొదటి జీతం కళాశాలకే..
పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి నాటి గుర్తులను జ్ఞాపకం చేయడం గొప్ప విషయమని స్పీకర్ సిరికొండ కొనియాడారు. విద్యాశాఖమంత్రితో మాట్లాడి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్పీకర్‌గా తన మొదటి జీతం రాగానే కళాశాల అభివృద్ధికి అందిస్తానని ప్రకటించారు. అనంతరం కళాశాల పూర్వవిద్యార్థులు చారిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు తమకు చదువునేర్పిన గురువులు దగ్గు మనోహర్‌రావు, మొగిలయ్య, బండి కొమురయ్యలను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ నాగబండి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, నగర పంచాయతీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, డాక్టర్ సంతోష్‌కుమార్, అప్పాల సుధాకర్, కాళీప్రసాద్, ఎర్ర నాగేం దర్, లక్ష్మీనారాయణ, వల్లంపట్ల నాగేశ్వర్‌రావు, కృష్ణమాచార్య, కృష్ణమూర్తి, ఎంపీపీ సులోచన, రాజమహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
తరగతి గదుల్లో కలియ తిరుగుతూ..
నాకింకా గుర్తుంది. ఇదే గదిలో మా ప్రిన్సిపాల్ అనుముల కృష్ణమూర్తి సార్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డా.. అంటూ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా శనివారం తాను చదువుకున్న కళాశాలను స్పీకర్ సందర్శించారు. వందలాదిమంది విద్యార్థులు, పూర్వవిద్యార్థులు పూలవర్షం కురిపిస్తుండగా కళాశాలలోకి అడుగుపెట్టారు.
విద్యాలయ పాఠశాల విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం కళాశాల గదులను పరిశీలించారు. తాను చదువుకున్న తరగతి గదిలోకి వె ళ్తూ ఇదే మా తరగతి గది అంటూ అందరికీ చూపించారు. గదిలోకి వెళ్లి బ్లాక్‌బోర్డుపై ‘మెన్ మే కం అండ్ మెన్ మే గో, బట్ ఐ కెనాట్ గో ఫర్ ఎవర్’.. ఇక్కడకు ఎందరో వచ్చి పోతుంటారు.. కానీ నేనెక్కడికీ వెళ్లను.. అని రాశారు. తర్వాత అన్ని గదులను పరిశీలిస్తూ.. స్నేహితులకు వివరిస్తూ తిరిగారు. రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికీ నమస్కరించారు.