
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్న డూ లేనంతగా ధాన్యం సేకరణ ద్వారా దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా ధాన్యం సేకరణ పాలసీని పౌరసరఫరాలశాఖ పకడ్బందీగా రూపొందించడం ఒక ఎత్తయితే.. దీనికి అనుగుణంగా కనీస మద్దతు ధరలకు జరిగిన కొనుగోళ్లు, మార్కెట్ వ్యవస్థ బలోపేతం, సాగునీటి వనరుల వృద్ధితో పంటల విస్తీర్ణం పెరగడం కారణంగా ధాన్యం కొనుగోళ్లు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి.
అందరి సహకారంతోనే సాధించాం
‘సీఎం, మంత్రి సూచనల మేరకు శాఖ అధికారులు, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు బాగా పనిచేయడం వల్ల ఈ రికార్డు సాధ్యమైంది. ధాన్యం అమ్ముకోవడంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా ధాన్య సేకరణకు సంబంధించిన విభాగాలతో రాష్ట్రస్థాయిలో శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ సమన్వయం చేసుకున్నారు. స్వయంగా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు, రవాణా వంటి అంశాలను పరిశీలించారు. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి అయింది. కానీ ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా విజయవంతంగా కొనుగోళ్లను పూర్తిచేయగలిగాం. ఇందుకు కృషిచేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు’ – మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ చైర్మన్
ఈ ఘనత ముఖ్యమంత్రిదే
‘ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు ముఖ్యంగా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు పెరి గాయి. ఇందుకు అనుగుణంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిపాం. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు లేకుండా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులతోపాటు ఇతర విభాగాల అధికారులతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. కొత్త రాష్ట్రమైన తెలంగాణ కేవలం ఐదేళ్లలో ధాన్యం సేకరణలో దేశంలోనే పంజాబ్ తరువాత రెండవ స్థానానికి చేరుకుంది. ఇది రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. – నిరంజన్ రెడ్డి, మంత్రి
4 రెట్లు పెరిగిన సేకరణ
రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరు గుతున్న ధాన్యం కొనుగోళ్లు గడిచిన ఐదేళ్లలో ఏకంగా 4 రెట్లు పెరిగాయి. 2014–15లో ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో కలిపి మొత్తంగా 24.29 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయగా, ఈ ఏడాది 2018–19లో పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. రూ.13,675 కోట్ల విలువ చేసే 77.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 14.73 లక్షల మంది రైతుల నుండి కొనుగోలు చేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. కనీస మద్దతు ధర (గ్రేడ్–ఏ రకం క్వింటాల్‌కు రూ.1,770, సాధారణ రకం – క్వింటాల్‌కు రూ.1,750)కు సంబంధించిన చెల్లింపులను రైతు ఖాతాలోకి నేరుగా జమ చేసింది. ఖరీఫ్‌లో 8,09,885 మంది రైతుల నుండి 3,297 కొనుగోలు కేంద్రాల ద్వారా 40.41 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 6,63,723 మంది రైతుల నుండి 3,509 కొనుగోలు కేంద్రాల ద్వారా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ మొత్తం సేకరణతో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ తరువాత దేశంలోనే రెండవ స్థానం సంపాదించింది. ఖరీఫ్, యాసంగిలో తెలంగాణ పౌరసరఫరాల సంస్థ 6,816 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 14,73,608 మంది రైతుల నుండి 77.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది 2017–18లో 53.98 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఈ ఏడాది 23.43 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment