
టిడిపి ఎమ్మెల్యేలకు బెదిరింపులు:బాబుకు మొర!
తమకు బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్ద మొరపెట్టుకున్నారు.
హైదరాబాద్: తమకు బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్ద మొరపెట్టుకున్నారు. తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. వారి భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. పార్టీ మారాలంటూ తమపై ఒత్తిడి ఎక్కువైందని వారు తమ నేతకు తెలిపారు. స్వయంగా మంత్రులే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరకపోతే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని వారు తమగోడు వెళ్లబోసుకున్నారు.
దేనికీ భయపడవలసిన అవసరంలేదని వారికి చంద్రబాబు అభయం ఇచ్చారు. రాజకీయ వేధింపులను రాజకీయాలతోనే ఎదుర్కొందామన్నారు. ఏపి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటాయని వారికి చెప్పారు. మెట్రో విషయంలో వెనక్కి తగ్గవలసిన అవసరంలేదన్నారు. ప్రజాక్షేత్రంలో ముందుకెళ్లండని వారికి చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
**