'అవి' కేసీఆర్ హత్యలే
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అన్నీ సీఎం కేసీఆర్ చేసిన హత్యలేనని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వైఖరిపై వారు మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెప్పిస్తామన్న గతంలో కేసీఆర్ చెప్పి... మాట తప్పారని వారు విమర్శించారు. అందువ్లలే రైతుల ఆత్మహత్యలు జరిగాయిని విమర్శించారు. కరెంట్ లేక పంటలు ఎండిపోవడం, లేదా పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎర్రబెల్లి, మోత్కుపల్లి వివరించారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో రాష్ట్రంలో 325 మంది రైతులు చనిపోయినట్లు జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారని... కాని ఆ సంఖ్యను కేసీఆర్ 69కి కుదించారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. లక్షన్నర నష్టపరిహారం అందించారన్నారు. కేసీఆర్ సర్కార్ కనీసం ఆ నష్టపరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి, మోత్కుపల్లి కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.