క్షమాపణలు చెబుతాం.. అనుమతించండి
రెండోరోజూ కొనసాగిన టీ-టీడీపీ ఎమ్మెల్యేల నిరసన
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తాము జాతీయగీతాన్ని అవమానించినట్లుగా భావిస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, తమను సభకు అనుమతించాలని టీ-టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. తమ సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండోరోజు బుధవారం కూడా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ఆరోపించారు. తమనుసభ నుంచి నిరవధికంగా సస్పెండ్ చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నం, అరెస్టు
కాగా, అంతకుముందు టీ-టీడీపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎర్రబెల్లి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలంతా శాసనసభ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరగా, రవీంద్రభారతి వద్దకు చేరుకోగానే పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. అరెస్టయిన వారిలో జి.సాయన్న, మాగంటి గోపీనాథ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గాంధీ, రాజేందర్ రెడ్డి, ఎం. కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్, వివేకానంద ఉన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం వారిని విడుదల చేశారు.